ఈ రోజుల్లో స్టార్ హీరోల నుంచి ఒక సినిమా రావాలంటే కనీసం ఏడాదిన్నర లేదా రెండేళ్లు పడుతోంది. అలాంటిది కేవలం మూడు నెలల వ్యవధిలోనే వరుస సినిమాలతో థియేటర్లలో దిగిపోతూ తమిళ చిత్ర పరిశ్రమను విస్మయానికి గురిచేస్తున్నాడు సూర్య. గత కొన్నేళ్లుగా సరైన భారీ హిట్ లేక ఇబ్బంది పడ్డ ఆయన, ఇప్పుడు ఏకంగా ఒకే ఏడాది మూడు సినిమాలతో బాక్సాఫీస్‌పై దండయాత్ర చేస్తుండటం చూసి తోటి హీరోలు సైతం నివ్వెరపోతున్నారు.
మొదట ‘కరుప్పు’ (తెలుగులో ‘వీరభద్రుడు’)తో బాక్సాఫీస్ వద్ద పూనకాలు తెప్పించాడు. ఊరమాస్ రోల్‌లో అదరగొట్టి, కెరీర్‌లోనే మొట్టమొదటిసారి రూ. 300 కోట్ల గ్రాస్ క్లబ్‌లోకి అడుగుపెట్టాడు. ఆ జోష్ చల్లారకముందే ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ అనే ఏజ్-గ్యాప్ లవ్ డ్రామాతో రెండో విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు. ప్రపంచవ్యాప్తంగా రూ. 90 కోట్లకు అమ్ముడైన ఆ సినిమా, రూ. 100 కోట్లకు పైగా షేర్, రూ. 200 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి బయ్యర్లకు లాభాల పంట పండించింది. ఇలా ఒకే ఏడాది కేవలం రెండు చిత్రాలతోనే రూ. 500 కోట్ల గ్రాస్ మార్కెట్‌ను తిరగరాసి తన స్టామినా ఏంటో నిరూపించాడు.
ఈ రెండు విజయాల తర్వాత హ్యాట్రిక్‌పై కన్నేసిన సూర్య.. దీపావళి కానుకగా ‘సీన్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ‘ఆవేశం’ ఫేమ్ జీతు మాధవన్ దర్శకత్వంలో నజ్రియా నజీమ్, నస్లీన్ గఫూర్‌లతో కలిసి నటించాడు. ఇందులో విభిన్నమైన పోలీస్ పాత్రలో కనిపిస్తూ అంచనాలు పెంచాడు. ఈ సినిమా తర్వాత విశ్రాంతి తీసుకోకుండా ‘జై భీమ్’ దర్శకుడు టి.జె. జ్ఞానవేల్ దర్శకత్వంలో హోంబలే ఫిలింస్ నిర్మిస్తున్న తన 48వ ప్రాజెక్టును ప్రారంభించాడు. ఇందులో పోలీస్ పాత్రకు భిన్నంగా డాక్టర్‌గా కనిపించనున్నాడు.







