ఢిల్లీ వాయు కాలుష్యంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన

ఢిల్లీ వాయు కాలుష్యంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన

Summarize with AI

దేశ రాజధాని ఢిల్లీ–ఎన్‌సీఆర్‌లో పెరుగుతున్న వాయు కాలుష్యంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. గాలి నాణ్యత ప్రమాదకర స్థాయికి చేరుకోవడంతో సుప్రీంకోర్టు సుమోటోగా విచారణ చేపట్టింది. సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ సందర్భంగా.. ఢిల్లీలో గాలి పీల్చడం రోజుకు 30 సిగరెట్లు తాగడంతో సమానమని అమికస్ క్యూరీ అపరాజితా సింగ్ కోర్టుకు వివరించారు. వాహనాల నుంచి వెలువడే కాలుష్యం ప్రధాన సమస్యల్లో ఒకటని ధర్మాసనం అభిప్రాయపడింది. ఢిల్లీ–ఎన్‌సీఆర్‌లో ట్రాఫిక్ రద్దీ, ప్రజా రవాణా వ్యవస్థలో లోపాలు, టోల్‌ప్లాజాల వద్ద వాహనాలు నిలిచిపోవడం కాలుష్యాన్ని మరింత పెంచుతున్నాయని పేర్కొంది.

మరోవైపు పంట వ్యర్థాల దహనం కూడా ఢిల్లీ కాలుష్యానికి కారణమవుతోందని విచారణలో వెల్లడైంది. నవంబర్ 5న నమోదైన కాలుష్యంలో పంట వ్యర్థాల దహనం వాటా 14 శాతంగా ఉన్నట్లు కోర్టు దృష్టికి వచ్చింది. రైతులకు పంట వ్యర్థాల నిర్వహణపై అవగాహన కల్పించాలని, వాటిని కొనుగోలు చేసే ధరను ముందుగానే ప్రకటించాలని సుప్రీంకోర్టు సూచించింది. ఖరీదైన వ్యవసాయ యంత్రాలను వ్యక్తిగత రైతులకు అందించడం కంటే గ్రామ పంచాయతీలకు అందించడం ప్రయోజనకరమని అభిప్రాయపడింది. డీజిల్ రిక్షాలను దశలవారీగా తొలగిస్తున్నామని, ప్రజా రవాణాను మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. ఈ ఏడాది పంట వ్యర్థాల దహనం ఘటనలు తగ్గాయని కూడా వెల్లడించింది.

దీపావళి సమయంలో కాలుష్యం పెరగడం వల్ల పేద ప్రజలే ఎక్కువగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అమికస్ క్యూరీ పేర్కొన్నారు. దీనిపై స్పందించిన సీజేఐ.. పండుగల సమయంలో పేదలకు ఉపాధి అవకాశాలు ఉంటాయని, కాలుష్య నియంత్రణ చర్యల ప్రభావం అన్ని వర్గాలపై సమానంగా ఉండాలని అభిప్రాయపడ్డారు. వర్షాల కారణంగా కాలుష్యం కొంత తగ్గినప్పటికీ, ఏక్యూఐ 400 స్థాయికి చేరుకోవడం ఆందోళనకరమని వ్యాఖ్యానించారు. కేవలం కాలుష్య నియంత్రణ చర్యలకే పరిమితం కాకుండా, వాహన కాలుష్యం, పంట వ్యర్థాల దహనం, ప్రజా రవాణా లోపాలు వంటి సమస్యల మూలాలను పరిష్కరించాలని కేంద్రానికి సూచించారు. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు తక్షణ చర్యలతో పాటు దీర్ఘకాలిక ప్రణాళికలు అవసరమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

Join WhatsApp

Join Now

Leave a Comment