సీనియర్ నటి రేణు దేశాయ్ తన వ్యక్తిగత జీవితం, ఎదుర్కొంటున్న విమర్శలపై మరోసారి భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్‌తో విడాకులు తీసుకుని 14 ఏళ్లు గడిచినా ఇప్పటికీ తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఇవ్వకుండా, పవన్ కళ్యాణ్ మాజీ భార్యగానే అందరూ చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీరాముడు కూడా 14 ఏళ్ల వనవాసం చేశారని, మరి తన జీవితంలో ఈ వనవాసం ఎప్పుడు ముగుస్తుందని ప్రశ్నించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమె.. తన వ్యక్తిగత జీవితంపై సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోలింగ్, విమర్శలపై అసహనం వ్యక్తం చేశారు.
తన జీవితం బద్రి సినిమాతోనే ప్రారంభమైందని చాలామంది భావిస్తున్నారని, అంతకుముందు కూడా తనకంటూ ఒక ప్రత్యేక జీవితం ఉందనే విషయాన్ని మర్చిపోతున్నారని రేణు దేశాయ్ అన్నారు. 2012లో విడాకులు జరిగిన తర్వాత తాను వ్యక్తిగతంగా, వృత్తిపరంగా ఎన్నో విజయాలు సాధించానని వెల్లడించారు. మరాఠీ సినిమాను నిర్మించి విజయం అందుకున్నానని, మరో సినిమాకు కథ రాయడంతో పాటు నిర్మాణం, దర్శకత్వ బాధ్యతలు కూడా నిర్వహించానని తెలిపారు. డ్యాన్స్ షోలకు పనిచేయడంతో పాటు కవితలు రాశానని, ప్రస్తుతం నటిగా సినిమాల్లో కొనసాగుతున్నానని వివరించారు. ఇన్ని రంగాల్లో పనిచేస్తున్నప్పటికీ తనకంటూ ప్రత్యేక గుర్తింపు లేదన్నట్లుగా వ్యవహరించడం బాధ కలిగిస్తోందని పేర్కొన్నారు.
సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న ట్రోలింగ్ గురించి కూడా ఆమె తీవ్రంగా స్పందించారు. ఒక కుక్కను కాపాడినా విమర్శలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పవన్ కల్యాణ్ లేకపోతే తనకు జీవించే అర్హతే లేనట్టుగా కొందరు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తన వ్యక్తిత్వం, ప్రతిభ, వృత్తిపరమైన విజయాలను గుర్తించకుండా కేవలం పవన్ కల్యాణ్ మాజీ భార్యగానే తనను చూడటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు, వ్యక్తిత్వం ఉన్నాయని స్పష్టం చేశారు. రేణు దేశాయ్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.







