బంగ్లాదేశ్ (Bangladesh) మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) స్వదేశానికి తిరిగి వచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు ఆమె అనుచరులు చెబుతున్నారు. వచ్చే నెల 16న బంగ్లాదేశ్‌కు చేరుకునేందుకు విమానం (Aircraft) పంపించాలని ఆమె చేసిన విజ్ఞప్తిని అక్కడి ప్రభుత్వం (Government)తిరస్కరించినట్లు సమాచారం. దీంతో విమానం అందుబాటులో లేకపోతే భారత్-బంగ్లాదేశ్ సరిహద్దును (India-Bangladesh Border) కాలినడకన దాటి స్వదేశంలోకి అడుగుపెడతారని అనుచరులు పేర్కొంటున్నారు. సరిహద్దు వద్ద ఆమెకు స్వాగతం పలికేందుకు, అక్కడి నుంచి ఢాకా (Dhaka) వరకు మానవహారం ఏర్పాటు చేసేందుకు లక్షలాది మంది సిద్ధంగా ఉన్నారని వెల్లడించారు. ఈ విషయాన్ని హసీనా అనుచరుడు అబు ఒబైదా అరిన్ ఓ బ్రిటిష్ వార్తా సంస్థకు వెల్లడించినట్లు సమాచారం.
గోపాల్‌గంజ్‌లో మొబైల్ బ్యాంకింగ్ సేవలు నిలిపివేత
మరోవైపు, షేక్ హసీనా (Sheikh Hasina) సొంత జిల్లాగా పేరున్న గోపాల్‌గంజ్‌లో పరిస్థితులు ఉద్రిక్తంగా మారుతున్నాయి. జిల్లాలో రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు శుక్రవారం నుంచి మొబైల్ బ్యాంకింగ్ సేవలను నిలిపివేశారు. భద్రతా కారణాలతో ఈ నెల 15 నుంచే రైలు సేవలను కూడా నిలిపివేయగా, ఈ ఆంక్షలను నిరవధికంగా కొనసాగించనున్నట్లు అధికారులు తాజాగా ప్రకటించారు.
వచ్చే నెల 16న హసీనా స్వదేశానికి తిరిగి వస్తారన్న ప్రకటనతో బంగ్లాదేశ్‌లో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. ఈ నెల 15న గోపాల్‌గంజ్ జిల్లాలో పెద్ద ఎత్తున నిరసనలు, గృహ దహన ఘటనలు చోటుచేసుకున్నట్లు సమాచారం. దీంతో ముందస్తు జాగ్రత్తగా అధికారులు భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేస్తున్నారు








