భారత క్రికెట్ దిగ్గజం రోహిత్ శర్మ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఓ ఎరుపు రంగు జెర్సీ ఫొటో సోషల్ మీడియాలో ఒక్కసారిగా వైరల్‌గా మారింది. దీంతో ‘హిట్‌మ్యాన్’ వచ్చే ఐపీఎల్ సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) తరఫున ఆడబోతున్నాడా? అనే చర్చ మొదలైంది. అయితే ఈ ఫొటోకు ఐపీఎల్ ప్రాంచైజీ మార్పుతో ఎలాంటి సంబంధం లేదని తెలుస్తోంది. బెంగళూరుకు చెందిన గేమ్-టెక్ స్టూడియో లైట్‌ఫ్యూరీ గేమ్స్ (LightFury Games)లో రోహిత్ శర్మ వ్యూహాత్మక ఇన్వెస్టర్‌గా చేరాడు. అంతేకాకుండా సంస్థ రూపొందిస్తున్న ‘eCricket’ ఏఏఏ మొబైల్ గేమ్‌లో రోహిత్ అధికారిక ప్లేయబుల్ క్యారెక్టర్‌గా కనిపించనున్నాడు. సోషల్ మీడియాలో వైరల్ అయిన రెడ్ జెర్సీ లుక్ కూడా ఈ గేమ్‌లోని ‘Ultimate Squad’ మోడ్ సినిమాటిక్ టీజర్‌కు సంబంధించినదే.
ఈ గేమింగ్ ప్రాజెక్టులో రోహిత్‌తో పాటు ఇప్పటికే ఎంఎస్ ధోనీ, జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శ్రేయస్ అయ్యర్ వంటి క్రికెట్ స్టార్లు భాగస్వాములుగా ఉన్నారు. ‘Ultimate Squad’ మోడ్‌లో 700 మందికి పైగా లైసెన్స్ పొందిన క్రికెటర్ల నుంచి ఆటగాళ్లు తమకు నచ్చిన జెర్సీలతో డ్రీమ్ టీమ్‌ను రూపొందించుకునే అవకాశం ఉంటుందని సమాచారం. సెప్టెంబర్ 2026లో ముందస్తు యాక్సెస్ వినియోగదారుల కోసం ఫేజ్డ్ క్లోజ్డ్ బీటా టెస్టింగ్ ప్రారంభించేందుకు లైట్‌ఫ్యూరీ గేమ్స్ సిద్ధమవుతోంది. ఇప్పటికే ఈ గేమ్‌కు 3 లక్షలకు పైగా ప్రీ-రిజిస్ట్రేషన్లు నమోదైనట్లు తెలుస్తోంది. దీంతో రోహిత్ రెడ్ జెర్సీ ఫొటో ఆర్సీబీలో చేరికకు సంకేతమని అభిమానులు చేసిన అంచనాలకు ఫుల్స్టాప్ పడినట్టే.. అసలు విషయం గేమింగ్ ప్రపంచానికి సంబంధించినదని స్పష్టమైంది.








