RCB Short Ball Strategy: పక్కా ప్లాన్‌తో గుజరాత్‌ను ‘బౌన్స్’ చేసిన ఆర్సీబీ

RCB Short Ball Strategy: పక్కా ప్లాన్‌తో గుజరాత్‌ను ‘బౌన్స్’ చేసిన ఆర్సీబీ

టాటా ఐపీఎల్(TATA IPL) ఫైనల్ మ్యాచ్ (Final Match) అనగానే అభిమానులు ఆఖరి బంతి వరకు ఉత్కంఠను ఊహిస్తారు. కానీ, ఈసారి ఫైనల్ మాత్రం వన్‌సైడ్ గేమ్‌గా మారిపోయింది. గుజరాత్ టైటాన్స్ (GT) తన హోమ్ గ్రౌండ్‌లో చేతులెత్తేయగా.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఎక్కడా తడబడకుండా ఏకపక్షంగా ట్రోఫీని కైవసం చేసుకుంది. అయితే, మ్యాచ్‌ను ఇంత సులువుగా ఆర్సీబీ వైపు తిప్పింది మాత్రం వారి బౌలర్లు వేసిన ఒకే ఒక వ్యూహం.. అదే ‘షార్ట్ బాల్ స్ట్రాటజీ’(Short Ball Strategy)!

రెడ్-సాయిల్ పిచ్‌ను వాడేసుకున్నారు
నరేంద్ర మోదీ స్టేడియం (Narendra Modi Stadium) మిశ్రమ మట్టితో కూడిన పిచ్ అయినప్పటికీ, అందులోని రెడ్-సాయిల్ (Red Soil) (ఎర్రమట్టి) ఎక్స్‌ట్రా బౌన్స్‌ను ఇస్తుంది. దీనిని ఆర్సీబీ బౌలర్లు అద్భుతంగా ఉపయోగించుకున్నారు. పిచ్ బంతిని పట్టుకుని, టర్న్ చేస్తూ, ఒక్కసారిగా పైకి లేస్తుండటాన్ని గమనించిన ఆర్సీబీ పేసర్లు.. గుజరాత్ బ్యాటర్లను షార్ట్ పిచ్ బంతులతో ఉక్కిరిబిక్కిరి చేశారు.

ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ (Rajat Patidar) ఈ వ్యూహం గురించి మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. “మేము ముందే షార్ట్ బాల్స్ వేయాలని ప్లాన్ చేసుకోలేదు. పిచ్ కండిషన్స్ చూసి ఆయా బౌలర్లే మైదానంలో తీసుకున్న నిర్ణయం ఇది. మా బౌలింగ్ కోచ్ ఓంకార్ సాల్వ్ తో (Omkar Salvi) బౌలర్లు వన్-టు-వన్ సెషన్స్ లో చాలా సమయం గడుపుతారు. వారి ప్లాన్స్‌పై నాకు పూర్తి నమ్మకం ఉంది, అందుకే నేను మ్యాచ్ మధ్యలో వారిని అస్సలు ఇబ్బంది పెట్టను.”

ఆర్సీబీ బౌలర్లు వేసిన మొత్తం 120 బంతుల్లో దాదాపు 45 బంతులు షార్ట్-పిచ్ లేదా షార్ట్-ఆఫ్-లెంత్ బంతులే కావడం విశేషం. ఈ షార్ట్ బాల్ వ్యూహానికి బలైన వారిలో గుజరాత్ టాప్ ఆర్డర్, మిడిల్ ఆర్డర్ పిల్లర్లు ఉన్నారు. శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్, నిషాంత్ సింధు, అర్షద్ ఖాన్, జేసన్ హోల్డర్, రషీద్ ఖాన్.. వీరంతా షార్ట్ బాల్స్‌కే వికెట్లు పారేసుకున్నారు. జేసన్ బట్లర్ (స్టంప్డ్), రాహుల్ తెవాటియా (స్లోయర్ బాల్) మాత్రమే ఈ వ్యూహానికి దొరక్కుండా అవుటయ్యారు.

భువీ, హాజిల్‌వుడ్, రసిఖ్ లీడర్‌షిప్
డిఫిక‌ల్ట్‌ పిచ్‌పై సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ (Bhuvneshwar Kumar) (2/29) పవర్‌ప్లేలో కేవలం 11 పరుగులే ఇచ్చి సాయి సుదర్శన్ వికెట్ తీసి బ్రేక్ ఇచ్చాడు. జోష్ హాజిల్‌వుడ్ (Josh Hazlewood) (2/37), రసిఖ్ సలామ్ దార్ (3/27) కూడా అదే లెంగ్త్‌ను మెయింటైన్ చేస్తూ గుజరాత్‌ను 155/8 పరుగులకే పరిమితం చేశారు. గుజరాత్ తరఫున ఈ సీజన్‌లో 700 ప్లస్ పరుగులు చేసిన గిల్, సుదర్శన్ ఇద్దరూ 4వ ఓవర్ ముగిసేసరికే పెవిలియన్ చేరడం జీటీ కోలుకోలేని దెబ్బ తీసింది.

పవర్‌ప్లేలోనే మ్యాచ్ ఫినిష్ చేసిన ‘కింగ్’ కోహ్లీ
156 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ.. పవర్‌ప్లేలోనే మ్యాచ్‌ను తమ వైపు తిప్పుకుంది. దీని గురించి విరాట్ కోహ్లీ మాట్లాడుతూ.. “నేను వెంకటేష్ అయ్యర్‌తో ఒకటే చెప్పాను.. పవర్‌ప్లేలోనే మ్యాచ్‌ను చంపేయాలి (Kill the game) అని. దానికి తను కూడా ‘యస్, లెట్స్ గో’ అన్నాడు. పెద్ద మ్యాచ్‌లలో వికెట్లు పడితే రన్ రేట్ పెరిగి ఒత్తిడి పెరుగుతుంది. అందుకే రన్ రేట్ ఎప్పుడూ 7 లేదా 8 కి వెళ్లకుండా ముందే బౌలర్లపై ఎటాక్ చేశాం.”

కోహ్లీ కేవలం 25 బంతుల్లోనే ఐపీఎల్ చరిత్రలో తన ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. కోహ్లీ-అయ్యర్ జోడి 4.3 ఓవర్లలోనే 62 పరుగులు జోడించడంతో గుజరాత్ ఆశలు అక్కడే గల్లంతయ్యాయి.

సమర్థించుకున్న గుజరాత్
తాము షార్ట్ బాల్స్ ఆడలేక ఓడిపోయామనే వాదనను జీటీ డైరెక్టర్ విక్రమ్ సోలంకి కొట్టిపారేశారు. “గణాంకాల పరంగా ఏ లెంత్ బాల్స్ వేశారు అనేది ఇప్పుడు చర్చించడం అనవసరం. ఆర్సీబీ ఈరోజు మమ్మల్ని ఓడించింది, అది నిజం. మా జర్నీని చూసి మేము గర్వపడుతున్నాం, అలాగే విజేతగా నిలిచిన ఆర్సీబీకి హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నాం” అని ఆయన వ్యాఖ్యానించారు. కారణాలు ఏవైనా.. ఆర్సీబీ బౌలర్ల పక్కా ప్లానింగ్, విరాట్ కోహ్లీ విధ్వంసకర బ్యాటింగ్ కలిసి బెంగళూరుకు రెండవ సారి ఐపీఎల్ కప్పును అందించాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment