తెలంగాణ కాంగ్రెస్‌లో ఎమ్మెల్సీ టికెట్ కేటాయింపుపై నెలకొన్న గందరగోళానికి తెరపడినట్లు తెలుస్తోంది. సూర్యాపేట నియోజకవర్గ కాంగ్రెస్ బాధ్యతలు చూస్తున్న రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డికి ఎమ్మెల్సీ టికెట్ దక్కిన నేపథ్యంలో ఆయన అసంతృప్తిగా ఉన్నారంటూ ఇటీవల ప్రచారం జరిగింది. అయితే, పార్టీ నేతలతో జరిగిన చర్చల అనంతరం ఆయన వెనక్కి తగ్గినట్లు సమాచారం.
తనను సంప్రదించలేదని అసంతృప్తి
ఎమ్మెల్సీ టికెట్ విషయంలో తనను సంప్రదించకుండా, తనకు సమాచారం ఇవ్వకుండానే నిర్ణయం తీసుకున్నారంటూ సర్వోత్తమ్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేసినట్లు వార్తలు వచ్చాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సూర్యాపేట ఎమ్మెల్యే టికెట్ దక్కకుండా తనను పక్కకు తప్పించే ప్రయత్నం జరుగుతోందని ఆయన తన అనుచరుల వద్ద వ్యాఖ్యానించినట్లు సమాచారం. ఈ విషయాన్ని కొందరు కీలక నేతల దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు ప్రచారం జరిగింది. సూర్యాపేట ఎమ్మెల్యే టికెట్‌పై స్పష్టత ఇవ్వకపోతే ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో నుంచి తప్పుకుంటానని ఒక దశలో ఆయన అల్టిమేటం ఇచ్చినట్లు కూడా వార్తలు వచ్చాయి.
నేతల సర్దుబాటుతో యూటర్న్
అయితే, పరిణామాలు ముదిరేలోపే కొందరు కాంగ్రెస్ నేతలు సర్వోత్తమ్ రెడ్డితో చర్చించి పరిస్థితిని సర్దుబాటు చేసినట్లు సమాచారం. దీంతో ఎమ్మెల్సీ పోటీ విషయంలో వెనక్కి తగ్గిన ఆయన.. తనకు టికెట్ కేటాయింపు విషయంలో జరుగుతున్న ప్రచారాన్ని ఖండిస్తూ పత్రికా ప్రకటన విడుదల చేసినట్లు తెలుస్తోంది. పార్టీ నిర్ణయానికి తాను కట్టుబడి ఉంటానని సర్వోత్తమ్ రెడ్డి స్పష్టం చేసినట్లు సమాచారం. దీంతో ఎమ్మెల్సీ టికెట్‌పై ఆయన అసంతృప్తిగా ఉన్నారంటూ సాగిన ప్రచారానికి తెరపడినట్లయింది.
సూర్యాపేటలో మారుతున్న సమీకరణాలు
తండ్రి దామోదర్‌రెడ్డి రెడ్డి మరణం తర్వాత సూర్యాపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ బాధ్యతలను సర్వోత్తమ్ రెడ్డి చూస్తున్నారు. అయితే ఇటీవల చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో పటేల్ రమేష్ రెడ్డి వర్గం నుంచి కూడా రాజకీయంగా యాక్టివిటీ పెరిగినట్లు చర్చ జరుగుతోంది.
ఈ క్రమంలోనే అనూహ్యంగా సర్వోత్తమ్ రెడ్డికి ఎమ్మెల్సీ టికెట్ కేటాయింపు జరగడం, దానిపై కొంత గందరగోళం నెలకొనడం చర్చనీయాంశంగా మారింది. అయితే పార్టీ నేతలు ఎమ్మెల్సీ పోటీ విషయంలో మరింత గందరగోళానికి తావివ్వకుండా సమన్వయంతో ముందుకు వెళ్లాలని సూచించడంతో సర్వోత్తమ్ రెడ్డి తన వైఖరిని స్పష్టం చేసినట్లు సమాచారం.








