‘రామాయణ’ రిలీజ్ డేట్ మారనుందా? ప్రమోషన్స్‌లో మాస్టర్ ప్లాన్!

‘రామాయణ’ రిలీజ్ డేట్ మారనుందా? ప్రమోషన్స్‌లో మాస్టర్ ప్లాన్!

Summarize with AI

బాలీవుడ్ మాత్రమే కాదు.. దేశవ్యాప్తంగా సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో ‘రామాయణ’ ఒకటి. కథ అందరికీ తెలిసినదే అయినా.. దాదాపు రూ.4 వేల కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విజువల్స్, గ్రాఫిక్స్ ఏ స్థాయిలో ఉండబోతున్నాయన్నదే అసలు ఆసక్తిని పెంచుతోంది. రణ్‌బీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా, యశ్ రావణుడిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా రూపొందిస్తున్నారు. మొదటి భాగాన్ని ఈ ఏడాది నవంబర్ 8న విడుదల చేయాలని మేకర్స్ తొలుత భావించినప్పటికీ.. దీపావళి సందర్భంగా కాకుండా నవంబర్ 5 లేదా 6న ముందుగానే థియేటర్లలోకి తీసుకురావాలనే ఆలోచనలో ఉన్నట్లు బాలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. దీపావళి వేడుకల కారణంగా ప్రేక్షకుల దృష్టి సినిమాపై పూర్తిగా ఉండకపోవచ్చన్న ఉద్దేశంతోనే విడుదల తేదీని ప్రీ-పోన్ చేయాలని భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఇక ‘రామాయణ’ ప్రమోషన్స్ విషయంలోనూ మేకర్స్ సరికొత్త వ్యూహాన్ని అనుసరిస్తున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా స్టార్ హీరోలతో భారీ ప్రమోషన్స్ నిర్వహించే బదులు.. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు, డిజిటల్ కంటెంట్ క్రియేటర్లపై ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నారు. ప్రపంచంలో అత్యధిక సబ్‌స్క్రైబర్లు కలిగిన యూట్యూబర్ మిస్టర్ బీస్ట్ అలియాస్ జిమ్మీ డొనాల్డ్‌సన్ కోసం ప్రత్యేక ఈవెంట్ నిర్వహించడం ద్వారా పాన్-వరల్డ్ స్థాయిలో సినిమాపై బజ్ క్రియేట్ చేసే ప్రయత్నం చేశారు. అంతకుముందు కూడా కంటెంట్ క్రియేటర్ల కోసం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యంగా జెన్‌-జీ ఆడియన్స్‌ను టార్గెట్ చేస్తూ ఈ కొత్త తరహా ప్రమోషన్‌ను ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. సినిమా ప్రమోషన్స్ కోసమే సుమారు రూ.300 కోట్లు ఖర్చు చేయనున్నట్లు బాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. భారీ బడ్జెట్, భారీ తారాగణం, అంతే భారీ ప్రమోషన్‌తో వస్తున్న ‘రామాయణ’ ప్రేక్షకుల అంచనాలను ఏ మేరకు అందుకుంటుందో చూడాలి.

Join WhatsApp

Join Now

Leave a Comment