దేశ రాజ్యసభలో ఈ ఏడాది మొత్తం 73 మంది ఎంపీలు రిటైర్ (73 Members of Parliament – MPs) కానున్నారు. ఈ మేరకు రాజ్యసభ సచివాలయం (Rajya Sabha Secretariat) పార్లమెంటరీ బులిటెన్ (Parliamentary Bulletin)ను విడుదల చేసింది. రిటైర్ అవుతున్న ఎంపీల స్థానాల్లో ఎన్నికలు నిర్వహించేందుకు ఫిబ్రవరిలో భారత ఎన్నికల సంఘం (ఈసీ) నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం. ఈ ఎన్నికలు ఏప్రిల్, నవంబర్ నెలల్లో రెండు విడతలుగా జరగనున్నాయి.
ఏపీ నుంచి నలుగురు ఎంపీలు రిటైర్
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) నుంచి మొత్తం నలుగురు రాజ్యసభ సభ్యులు జూన్ 21న పదవీ విరమణ చేయనున్నారు. వీరిలో వైసీపీ(YSRCP)కి చెందిన ఎంపీలు అయోధ్య రామిరెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, పరిమల్ నత్వాని, తెలుగుదేశం పార్టీ ఎంపీ సానా సతీష్ బాబు ఉన్నారు.
తెలంగాణ నుంచి ఇద్దరు
తెలంగాణ రాష్ట్రం (Telangana State) నుంచి ఈ ఏడాది ఇద్దరు ఎంపీలు రాజ్యసభ నుంచి రిటైర్ కానున్నారు. ఏప్రిల్ 9న బీఆర్ఎస్ ఎంపీ సురేష్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభిషేక్ సింగ్వి పదవీకాలం ముగియనుంది.
రిటైర్ కానున్న ప్రముఖ ఎంపీలు
ఈ ఏడాది పదవీకాలం ముగియనున్నవారిలో పలువురు ప్రముఖులు కూడా ఉన్నారు. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి, నామినేటెడ్ ఎంపీ రంజన్ గొగోయ్, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, కేంద్ర మంత్రులు హర్దీప్ సింగ్ పూరి, రాందాస్ అథవాలే, కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ వంటి వారు రిటైర్ కానున్నారు. ఇంత పెద్ద సంఖ్యలో రాజ్యసభ సభ్యులు రిటైర్ కావడంతో, ఆయా రాష్ట్రాల్లోని రాజకీయ పార్టీల్లో కొత్త అభ్యర్థుల ఎంపికపై చర్చలు మొదలయ్యాయి. ముఖ్యంగా ఏపీ, తెలంగాణతో పాటు ఉత్తరప్రదేశ్, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో రాజ్యసభ సీట్లు రాజకీయంగా కీలకంగా మారనున్నాయి.
రాష్ట్రాల వారీగా రిటైర్ కానున్న ఎంపీల సంఖ్య
ఉత్తరప్రదేశ్ – 10
తమిళనాడు – 6
పశ్చిమ బెంగాల్ – 5
బీహార్ – 5
మహారాష్ట్ర – 4
ఒడిశా – 4
గుజరాత్ – 4
కర్ణాటక – 4
అస్సాం – 3
మధ్యప్రదేశ్ – 3
రాజస్థాన్ – 3
చత్తీస్‌గఢ్ – 2
హర్యానా – 2
జార్ఖండ్ – 2
హిమాచల్ ప్రదేశ్ – 1
మణిపూర్ – 1
మేఘాలయ – 1
అరుణాచల్ ప్రదేశ్ – 1
మిజోరం – 1
ఉత్తరాఖండ్ – 1








