రైతు డిస్కమ్ ఏర్పాటు పేరుతో ఉచిత విద్యుత్‌కు మంగళం పాడే కుట్ర జరుగుతోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్ రావు ఆరోపించారు. రైతు డిస్కమ్ ఏర్పాటుకు సంబంధించిన జీవో నంబర్ 17ను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. రాజకీయ పార్టీలు, ఉద్యోగ సంఘాలు, విద్యుత్ రంగ నిపుణులు, రైతుల అభ్యంతరాలను పట్టించుకోకుండా ప్రభుత్వం ముందుకెళ్లడాన్ని ఆయన తప్పుబట్టారు. వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్ అందించడమే లక్ష్యమైతే, కొత్త డిస్కమ్ వల్ల రైతులకు కలిగే ప్రయోజనాలేమిటో ప్రభుత్వం స్పష్టం చేయాలని ప్రశ్నించారు.
ఇప్పటికే ట్రాన్స్‌ఫార్మర్ల సమస్యలు, విద్యుత్ సరఫరా ఇబ్బందులతో రైతులు సతమతమవుతుంటే, కొత్త వ్యవస్థతో మరిన్ని సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని హెచ్చరించారు. కొత్త రైతు డిస్కమ్ పరిధిలోకి 30.62 లక్షలకు పైగా కనెక్షన్లు, 512 లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలు వస్తున్నాయని, ఇంత భారీ వ్యవస్థను కేవలం 2,000 మంది సిబ్బందితో ఎలా నిర్వహిస్తారని హరీష్ రావు ప్రశ్నించారు.
వ్యవసాయానికి కేటాయించిన థర్మల్ విద్యుత్ వాటా 25 శాతానికే పరిమితం కావడం, సౌర విద్యుత్ రాత్రివేళ అందుబాటులో లేకపోవడం, జల విద్యుత్ ఏడాదిలో కొన్ని నెలలకే పరిమితం కావడం వంటి అంశాలను ప్రస్తావించారు. లక్షలాది వ్యవసాయ ట్రాన్స్‌ఫార్మర్లు, లక్షల కిలోమీటర్ల విద్యుత్ లైన్ల నిర్వహణపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. కొత్త డిస్కమ్‌కు అప్పులు, బకాయిలను బదిలీ చేస్తూ దాని ఆర్థిక స్థిరత్వానికి ఎలాంటి భరోసా కల్పిస్తోందని నిలదీశారు. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తామని చెబుతున్న ప్రభుత్వం, ఆ హామీని ఎలా నిలబెట్టుకుంటుందో సమాధానం చెప్పాలని, రైతు డిస్కమ్ జీవోను వెంటనే రద్దు చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.








