ఆంధ్రప్రదేశ్‌లో అధికార కూటమిలోని జనసేన పార్టీ ఎమ్మెల్యేల అక్రమాలు, అవినీతి దందాలు రోజురోజుకు తారాస్థాయికి చేరుతున్నాయి. తాజాగా పోలవరం నియోజకవర్గంలో జనసేన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు అనుచరులు, సన్నిహితుల మధ్య నడిచిన మట్టి మాఫియా నగదు పంపకాల బాగోతం బట్టబయలై రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.
డబ్బుల పంపకాలపై రచ్చ.. వీడియో వైరల్
పోలవరం నియోజకవర్గంలో అక్రమ మట్టి తవ్వకాలు, దందాలు పరాకాష్ఠకు చేరాయనడానికి ఈ తాజా ఘటనే నిదర్శనం. కొయ్యలగూడానికి చెందిన జనసేన నేత దుగ్గిన శ్రీనుకు, ఎమ్మెల్యే చిర్రి బాలరాజు సన్నిహితురాలైన ఒక మహిళకు మధ్య మట్టి తవ్వకాలకు సంబంధించి భారీగా నగదు పంపకాల విషయంలో విభేదాలు తలెత్తాయి.
తనకు రావాల్సిన మట్టి డబ్బులు వెంటనే ఇవ్వకపోతే పరిస్థితి వేరేలా ఉంటుందని జనసేన నేత దుగ్గిన శ్రీనును ఆ సన్నిహితురాలు తీవ్రస్థాయిలో నిలదీసి హెచ్చరించింది. ఈ డబ్బుల వ్యవహారం రచ్చకెక్కడంతో పరువు పోతుందని భావించిన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు స్వయంగా రంగంలోకి దిగి ఇరువురి మధ్య రాజీ కుదిర్చి వివాదాన్ని సద్దుమణిగించే ప్రయత్నం చేశారు. అయితే దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ కావడంతో జనసేన డొల్లతనం బయటపడింది.
పవన్ సీరియస్.. కమిటీల ఏర్పాటు
ఎమ్మెల్యే చిర్రి బాలరాజు అక్రమాలు, సెటిల్‌మెంట్ల వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో జనసేన హైకమాండ్ స్పందించినట్లు హడావిడి చేస్తోంది. పార్టీ ప్రతిష్ట దెబ్బతినకుండా ఉండేందుకే హైలెవెల్ విచారణ కమిటీ అంటూ ప్రకటనలు ఇచ్చి కేవలం కాలయాపన చేస్తున్నారని ప్రజలు, రాజకీయ విశ్లేషకులు మండిపడుతున్నారు.
గతంలో రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ రాసలీలలు, అక్రమాల వివాదం బయటపడినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ త్రిసభ్య కమిటీ అంటూ ఇలాగే హడావిడి చేసినా.. చివరికి ఎలాంటి చర్యలు తీసుకోకుండా బాధితురాలినే వేధించిన చరిత్ర జనసేనది అని విమర్శిస్తున్నారు.
సరిగ్గా అదే కోవకు చెందినదే తాజాగా చిర్రి బాలరాజుపై వేసిన కమిటీ కూడా అని, ఇది కేవలం కంటితుడుపు చర్యేనని సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అధికారంలోకి రాగానే నీతులు వల్లించిన జనసేన నేతలు, క్షేత్రస్థాయిలో చేస్తున్న ఇసుక, మట్టి మాఫియా దోపిడీలను చూస్తుంటే.. ఇలాంటి బాలరాజులు పార్టీలో ఇంకా ఎంతమంది ఉన్నారోనని ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.








