దేశ రాజధాని ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ (CJP) తలపెట్టిన భారీ నిరసనల నేపథ్యంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలనే డిమాండ్‌తో జంతర్ మంతర్ వద్ద ఆందోళనకు సీజేపీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ నిరసనకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో ఢిల్లీ వ్యాప్తంగా ముందస్తు అరెస్టులు, ఆంక్షలు తీవ్రతరం అయ్యాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో‘ధృవ్ రాఠీ అరెస్ట్’ (Dhruv Rathee Arrest) ట్రెండింగ్‌లో నిలిచింది.
ఎన్నికల సంఘం తీరుపై సీజేపీ భగ్గు..
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియలో భారీ అక్రమాలు జరిగాయని, పౌరుల ఓటు హక్కును కాలరాస్తున్నారని ఆరోపిస్తూ సీజేపీ ఈ ఆందోళనకు సిద్ధమైంది. భద్రతా కారణాలు, నిబంధనల ఉల్లంఘనల పేరుతో పోలీసులు అనుమతి ఇవ్వనప్పటికీ.. వెనక్కి తగ్గేది లేదని నిర్వాహకులు తేల్చిచెప్పారు. దీంతో ఢిల్లీ సరిహద్దులు, జంతర్ మంతర్ పరిసర ప్రాంతాలను పోలీసులు తమ అదుపులోకి తీసుకున్నారు.
ట్రెండింగ్‌లో ‘ధృవ్ రాఠీ అరెస్ట్’
ఈ ఆందోళనల్లో పాల్గొనేందుకు విదేశాల నుంచి వచ్చిన ప్రముఖ యూట్యూబర్, ఇన్ఫ్లుయెన్సర్ ధృవ్ రాఠీని హర్యానాలోని గురుగ్రామ్‌లో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఈ వార్త బయటకు రావడంతో సోషల్ మీడియాలో ఆయన అరెస్ట్‌కు సంబంధించిన చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది. మరోవైపు ఈ నిరసనలకు బాహాటంగా మద్దతు తెలుపుతున్న నటుడు ప్రకాష్ రాజ్‌ను కూడా పోలీసులు అడ్డుకునే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి.
ముంబై నుంచి బయల్దేరిన అభిజిత్ దీప్కే..
సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే శనివారం ఉదయం ముంబై నుంచి ఢిల్లీకి బయల్దేరారు. కేంద్ర ప్రభుత్వం దేశంలో ‘ఎమర్జెన్సీ’ తరహా పరిస్థితులు సృష్టించి భయపెట్టాలని చూస్తోందని, నిరసనకు అనుమతి లేకపోయినా తమ పోరాటం ఆగదని ఆయన స్పష్టం చేశారు. అయితే ఢిల్లీకి చేరుకుంటున్న అభిజిత్ దీప్కేను కూడా ఎప్పుడైనా పోలీసులు అరెస్ట్ చేయొచ్చనే ప్రచారం తీవ్రతరం కావడంతో సీజేపీ శ్రేణుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.








