తమిళనాడులో TVK.. పుదుచ్చేరి, బెంగాల్, అస్సాంలో ఎన్డీయే హవా!

తమిళనాడులో TVK.. పుదుచ్చేరి, బెంగాల్, అస్సాంలో ఎన్డీయే హవా!

Summarize with AI

దేశవ్యాప్తంగా అక్టోబర్ 6న జరిగిన ఆరు ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు దాదాపు పూర్తయింది. తమిళనాడు, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్, అస్సాం రాష్ట్రాల్లో జరిగిన ఈ ఉప ఎన్నికల్లో ఫ‌లితాలు వెలువ‌డుతున్నాయి. తమిళనాడులో ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని ‘తమిళగ వెట్రి కజగం’ (TVK) బోణీ కొట్టి ప్రభంజనం సృష్టించగా.. పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్, అస్సాంలలో ఎన్డీయే స్పష్టమైన ఆధిపత్యాన్ని చాటుకున్నాయి.

తమిళనాడులో..
తమిళనాడు ఉప ఎన్నికల్లో సీఎం విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ఘన విజయం సాధించింది. ప్ర‌తిప‌క్ష డీఎంకే, అన్నాడీఎంకే పార్టీల‌కు గట్టి షాక్ ఇస్తూ పోటీ చేసిన రెండు స్థానాలనూ టీవీకే కైవసం చేసుకునే పరిస్థితి కనిపిస్తోంది. మధురాంతకం నియోజకవర్గంలో టీవీకే అభ్యర్థి కె. మరగతం కుమారవేల్ డీఎంకే అభ్యర్థి ఐ. పరంధామెన్‌పై దాదాపు 19,312 ఓట్ల భారీ మెజారిటీతో ముందంజలో ఉన్నారు.

ధరాపురం నియోజకవర్గంలో టీవీకే అభ్యర్థి పి. సత్యబామ డీఎంకే అభ్యర్థి ఎస్. సుగన్యపై ముందు వరుసలో ఉన్నారు. గతంలో అన్నాడీఎంకే తరఫున గెలిచి, రాజీనామా చేసి టీవీకేలో చేరిన ఈ ఇద్దరు మహిళా నేతలు తిరిగి విజయం సాధించడంతో తమిళనాడు రాజకీయాల్లో విజయ్ నేతృత్వంలోని టీవీకే హవా స్పష్టమైంది.

పుదుచ్చేరిలో..
పుదుచ్చేరిలోని తట్టన్‌చావడి అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో అధికార ఆల్ ఇండియా ఎన్.ఆర్. కాంగ్రెస్ (AINRC) అభ్యర్థి అశోక్ ఆనంద్ కాంగ్రెస్ అభ్యర్థి ఇ. వినాయగంపై 8,482 ఓట్ల తేడాతో ముందంజలో ఉన్నారు.

పుదుచ్చేరి ముఖ్యమంత్రి, ఏఐఎన్‌ఆర్‌సీ అధినేత ఎన్. రంగస్వామి ఏప్రిల్ ఎన్నికల్లో తాను గెలిచిన రెండు స్థానాల్లో ఒకటైన ‘మంగళం’ను నిలుపుకొని, ‘తట్టన్‌చావడి’ స్థానానికి రాజీనామా చేయడంతో ఈ ఉప ఎన్నిక అనివార్యమైంది.

అస్సాంలో..
అస్సాంలోని నాగావ్ (Nagaon) లోక్‌సభ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో భారతీయ జనతా పార్టీ (BJP) భారీ లీడ్ లో కొనసాగుతోంది. బీజేపీ అభ్యర్థి దేవశిష్ శర్మ తన సమీప ప్రత్యర్థి, AIUDF అధినేత బద్రుద్దీన్ అజ్మల్‌పై లక్షకు పైగా ఓట్ల మెజార్టీతో ముందంజలో కొనసాగుతున్నారు. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి శిబమోని బోరా మూడో స్థానానికి పరిమితమయ్యారు.

పశ్చిమ బెంగాల్‌లో..
పశ్చిమ బెంగాల్‌లోని నందిగ్రామ్ మరియు రెజీనగర్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్థులు స్పష్టమైన మెజారిటీతో దూసుకెళ్లారు. నందిగ్రామ్‌లో బీజేపీ అభ్యర్థి హాసిరాణి రాత్ సమీప కాంగ్రెస్ పోటీదారు మిలన్ ప్రధాన్‌పై భారీ ఆధిక్యంతో ఘనవిజయం సాధించారు. రెజీనగర్ స్థానంలో బీజేపీ అభ్యర్థి శంఖరవ్ సర్కార్ మొదటి నుంచి ఆధిక్యతను ప్రదర్శిస్తూ విజయం దిశగా సునాయాసంగా ముందుకెళ్లారు.

Join WhatsApp

Join Now

Leave a Comment