ప్రభుత్వం బకాయిలు విడుదల చేయకపోవడంతో ప్రైవేట్ ఆస్పత్రుల పరిస్థితి అధ్వాన్నంగా తయారైందని, బకాయిలు విడుదల చేస్తేనే ఉచిత వైద్య సేవలను కొనసాగిస్తామని ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ (ASHA) ప్రతినిధుల బృందం తీర్మానించింది. పెండింగ్ బకాయిలపై ASHA ప్రతినిధులు విజయవాడలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలపై చర్చించారు.
బ్యాంకుల నుంచి అప్పులు పుట్టడం లేదు..
ASHA అధ్యక్షులు డాక్టర్ విజయ్ కుమార్ మాట్లాడుతూ.. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి బకాయిలు చెల్లిస్తామని నిన్న చెప్పారన్నారు. తమకు ఆర్థికపరమైన ఇబ్బందులు పెరిగాయని, బ్యాంకుల నుంచి అప్పులు పుట్టడం లేదని, పరికరాలు కొనుగోలు చేసేందుకు కూడా కష్టంగా ఉందని వాపోయారు. ఈనెల 6వ తేదీ నుంచి క్యాష్ లెస్ సేవలు ఇవ్వలేమని నోటీసులు ఇచ్చామని, ప్రభుత్వం సోమవారం రావాలని ఆహ్వానించడంతో ఎన్టీఆర్ వైద్య సేవలు కొనసాగిస్తామన్నారు.
భారాన్ని మోయలేని పరిస్థితిలో ఆస్పత్రులు
ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ (EHS) సేవలు మాత్రం పూర్తిగా నిలిపివేయాలని నిర్ణయించామన్నారు. డబ్బులు ఇస్తేనే తమ సర్వీసులు కొనసాగిస్తామని తేల్చిచెప్పారు. మాట మాత్రంగా కాకుండా తమకు ప్రభుత్వం భరోసా ఇవ్వాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక రూ.1800 కోట్లు సర్వీసులు అందించామని, తమకు 1500 కోట్లు వరకు ప్రభుత్వం చెల్లించిందన్నారు. పాత బకాయిలుకు ఇప్పుడు మరో 300 కోట్లు వచ్చి చేరాలని, ఇప్పుడు భారాన్ని మోయలేని పరిస్థితిలో ఆస్పత్రులు ఉన్నాయని చెప్పారు. కనీసం 50 శాతం చెల్లించేలా చూడాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామని, ఇతర బకాయిలు కూడా ఎప్పుడెప్పుడు ఎంత చెల్లిస్తారో రాతపూర్వకంగా ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
పూర్తిగా చెల్లించాకే ఇన్సూరెన్స్ కు వెళ్లాలి..
ప్రభుత్వం ఇన్సూరెన్స్ సంస్థలకు ఇస్తామని చెబుతోందని, ఇన్సూరెన్స్ ప్యాకేజీలను కూడా సవరించాల్సి ఉందని డాక్టర్ విజయ్ కుమార్ చెప్పారు. ఈ ప్యాకేజీ రేట్లుపై జీఓ నంబర్ 12 జారీ చేశారని, ఆ ధరల ప్రకారం కూడా తమకు చెల్లించలేదని వాపోయారు. ఈ ఏడేళ్లల్లో 35 శాతం ధరలు పెరగాల్సి ఉండగా మూడు శాతం కూడా పెరగలేదని, ఆరోగ్య శ్రీ నెట్ వర్కు ఆస్పత్రులలో 50 శాతం క్రెడిట్ మీద సేవలు అందిస్తున్నాయని చెప్పారు. ఇప్పుడు మళ్లీ ఇన్సూరెన్స్ అంటే మూలిగే నక్క మీద తాటికాయ చందంగా తమ పరిస్థితి ఉంటుందన్నారు. బకాయిలు మొత్తం పూర్తిగా చెల్లించిన తరువాతే ఇన్సూరెన్స్ కు వెళ్లాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.








