ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయ వాతావరణం మరోసారి వేడెక్కింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) భీమవరం (Bhimavaram) డీఎస్పీ(DSP) జయసూర్య (Jayasurya)పై విచారణకు ఆదేశాలు జారీ చేయగా, అదే అంశంపై డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు విభిన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. జయసూర్య మంచి అధికారి అని ఆయన సమర్థిస్తూ, పవన్ కళ్యాణ్ ఆరోపణలను పరోక్షంగా ఖండించారు.
రఘురామ కృష్ణంరాజు (Raghurama Krishnam Raju) మాట్లాడుతూ.. “నా దృష్టిలో జయసూర్య చాలా మంచి ఆఫీసర్. భీమవరం పరిధిలో ఎక్కడా పేకాట శిబిరాలు లేవు. గత రెండు మూడు నెలలుగా పోలీసులు పేకాటపై ఉక్కుపాదం మోపారు. భీమవరంలో పేకాట అంటే అక్కడ ఊపిరి తీసుకున్నట్లే ఉంటుంది. ఎక్కడ పడితే అక్కడ పేకాట ఆడేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది. పోలీసులు జూదంపై ఉక్కుపాదం మోపారు” అని అన్నారు. పవన్ ఆదేశాల మేరకు ఎస్పీ రిపోర్ట్ ఇస్తారని, కానీ, పవన్ కళ్యాణ్ ఆయన శాఖలను మాత్రమే కాకుండా మిగిలిన శాఖలను కూడా పట్టించుకోవడం సంతోషించదగ్గ విషయం అని రఘురామకృష్ణంరాజు అన్నారు.
ఇక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భీమవరం డీఎస్పీపై జనసేన నేతల ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకొని, ఆయా ఆరోపణలపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలంటూ ఎస్పీకి ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. కాగా, భీమవరం డీఎస్పీ వ్యవహారంపై ఈ ఇద్దరు ప్రముఖ నేతల పరస్పర విరుద్ధమైన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. పవన్ కళ్యాణ్ డీఎస్పీపై ఆగ్రహం వ్యక్తం చేయగా, రఘురామ రాజు మాత్రం అదే అధికారిని సమర్థిస్తూ మాట్లాడడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చలకు దారి తీసింది.








