నేటి నుంచి పార్లమెంట్ (Parliament) శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 11 గంటలకు ఉభయ సభలు మొదలుకానున్నాయి. గత వర్షాకాల సమావేశాల (Monsoon Session) మాదిరిగానే, ఈ శీతాకాల సమావేశాలు (Winter Session) కూడా వాడివేడిగా, రభసగా సాగే అవకాశం ఉంది. బీహార్ ఎన్నికల ముందు ఈసీ నిర్వహించిన ఓటర్ల సర్వేపై ప్రతిపక్షాలు గతంలో తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. ప్రస్తుతం తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్‌లలోనూ ఈ సర్వే కొనసాగుతుండటంతో, ఇదే అంశంపై మరోసారి పార్లమెంట్ ఉభయ సభల్లో విపక్షాల నిరసనతో దద్దరిల్లే అవకాశం ఉంది. అంతేకాకుండా, ఇటీవల దేశ రాజధానిలో జరిగిన ఢిల్లీ పేలుడు (Delhi Blast) అంశంపై కూడా చర్చకు పట్టుబట్టే ఛాన్సుంది.
కీలక బిల్లులు, విపక్షాల వ్యూహాలు
ఈ సమావేశాల్లో ఎన్డీఏ ప్రభుత్వం (NDA Government) దాదాపు 14 బిల్లులను ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. వీటిలో అణుశక్తి బిల్లు, విద్యా కమిషన్ బిల్లు ముఖ్యమైనవి. అలాగే, పొగాకు ఉత్పత్తులు, పాన్ మసాలాలపై ఎక్సైజ్ సుంకం మరియు సెస్ విధించే బిల్లులు కూడా ప్రవేశపెట్టనున్నారు.
మరోవైపు, పార్లమెంట్ సమావేశాల కోసం వ్యూహరచన చేసేందుకు ఈరోజు ఉదయం 10 గంటలకు ఉభయ సభలకు చెందిన విపక్ష నేతలు సమావేశం కానున్నారు. రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) కార్యాలయంలో ఈ భేటీ జరగనుంది. “ఓటర్ల జాబితా క్రమబద్ధీకరణ”, దేశంలో ఉగ్ర దాడులు, అంతర్గత భద్రత, ఢిల్లీలో ప్రాణాంతక వాయు కాలుష్యం, పెరుగుతున్న ధరలు, నిరుద్యోగం వంటి ముఖ్యమైన అంశాలపై ఉభయ సభల్లో అనుసరించాల్సిన వ్యూహాన్ని ఈ సమావేశంలో ప్రతిపక్షాలు ఖరారు చేయనున్నాయి. ఈ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 19న ముగియనున్నాయి.








