నందమూరి తారక రామారావు (Nandamuri Taraka Rama Rao – NTR) 30వ వర్ధంతి సందర్భంగా ఆయన భార్య లక్ష్మీ పార్వతి (Lakshmi Parvathi) నివాళులు అర్పించారు. హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ (NTR Ghat) లో భర్త సమాధికి నివాళులు అర్పించిన అనంతరం మీడియాతో మాట్లాడిన ఆమె, ఎన్టీఆర్ వ్యక్తిత్వం, ఆశయాలు, రాజకీయ పోరాటాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాలం గడిచినా మహనీయులు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారని చెప్పేందుకు ఎన్టీఆర్ సాక్ష్యమని ఆమె అన్నారు.
మహనీయులు ఊరికే మహానుభావులు (Legends)కాలేరని, వారు చేసిన మంచి పనులే వారికి ఆ గుర్తింపు తీసుకొచ్చాయని లక్ష్మీపార్వతి వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్‌కు మరణమే లేదని, ఆయన ఆలోచనలు, ఆశయాలు ఇప్పటికీ జీవించేవేనని స్పష్టం చేశారు.
వెన్నుపోటు రాజకీయాలకు తలవంచని ఎన్టీఆర్
ఎన్టీఆర్ ఎప్పుడూ వెన్నుపోటు రాజకీయాలకు (Backstab Politics) తలవంచలేదని లక్ష్మీపార్వతి అన్నారు. తన ఆశయాన్ని చివరి వరకు కొనసాగిస్తానని ఆయన చెప్పేవారని గుర్తు చేశారు. సింహం ఎప్పుడూ పచ్చగడ్డి తినదని, పోరాడి సాధించుకుంటుందని ఎన్టీఆర్ చెప్పిన మాటలను ఈ సందర్భంగా ఆమె ప్రస్తావించారు.
వెన్నుపోటుదారులపై పోరాడి తిరిగి అధికారాన్ని దక్కించుకుంటానని ఎన్టీఆర్ అనుకున్నారని, అయితే ఆ సంకల్పం నెరవేరకముందే ఆయన కన్నుమూయాల్సి వచ్చిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అయినప్పటికీ ఎన్టీఆర్ ఆశయాన్ని నెరవేర్చే వారు చాలామంది వస్తున్నారని ఆమె అభిప్రాయపడ్డారు.
ఎన్టీఆర్ చివరి కోరిక సగం తీరిందని, రాజకీయాల్లో కొన్నిసార్లు కారుమబ్బులు కమ్ముతాయని అన్నారు. అయినా మళ్లీ ఆంధ్రప్రదేశ్‌కు మంచి రోజులు రావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ఎన్టీఆర్‌కు భారతరత్న (Bharat Ratna) ఇవ్వడంపై డ్రామా జరుగుతోందని వ్యాఖ్యానించారు. మాజీ సీఎం జగన్ (Former CM Y. S. Jagan Mohan Reddy) ఒక జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టారని, అయితే చంద్రబాబు (N. Chandrababu Naidu) ఎన్నిసార్లు సీఎం అయినా అలా చేయలేదని లక్ష్మీపార్వతి వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి.








