నెల్లూరు ఏఓ హత్య.. ఏకంగా స్టేష‌న్ సిబ్బంది మొత్తం బ‌దిలీ

నెల్లూరు ఏఓ హత్య.. ఏకంగా స్టేష‌న్ సిబ్బంది మొత్తం బ‌దిలీ

Summarize with AI

ఏపీ పోలీస్ శాఖలో ఏం జరుగుతోంది? అసలే విజయవాడ సాయికృష్ణ లాకప్‌డెత్ కేసు, క్రాంతికుమార్ కస్టోడియల్ టార్చర్ సూసైడ్, కర్నూలులో గంగమ్మ కస్టోడియల్ డెత్ వంటి దారుణాలు రాష్ట్ర పోలీస్ శాఖ ప్రతిష్టను మసకబార్చాయ‌న్న ఆరోప‌ణ‌లు ఉండ‌గా, ఇప్పుడు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో వెలుగుచూసిన ఘోరం నిర్ల‌క్ష్యం పరాకాష్టగా నిలిచింది.

విచారణలో అలసత్వం, బాధితులను బెదిరించి నేరస్థులకు కొమ్ముకాశార‌న్న ఆరోప‌ణ‌ల‌తో ఏకంగా బుచ్చిరెడ్డిపాలెం పోలీస్ స్టేషన్ సిబ్బంది మొత్తాన్ని ఒకేసారి బదిలీ చేస్తూ ఎస్పీ అనిత వేజెండ్ల తీసుకున్న సంచలన నిర్ణయం సంచలనం సృష్టిస్తోంది.

అసలేం జరిగింది?
బాధిత కుటుంబ స‌భ్యుల వివ‌రాల ప్ర‌కారం.. గత నెల (జూన్) 15న బుచ్చిరెడ్డిపాలెం మండల వ్యవసాయ అధికారి (AO) శ్రీహరి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఆస్తి వివాదం నేపథ్యంలో ఆయన సమీప బంధువులే (సొంత బావమరిది హరికృష్ణ) పథకం ప్రకారం కారులో తీసుకెళ్లి, గొంతు నులిమి, చివరకు వీధి కుక్కలను చంపేందుకు ఉపయోగించే అత్యంత విషపూరితమైన ఇంజెక్షన్లు ఇచ్చి క్రూరంగా హత్య చేశారు.

మృతుడి శరీరంపై గాయాలు, ముఖంపై గీతలు స్పష్టంగా కనిపిస్తున్నా, మృతుడు శ్రీ‌హ‌రి తోటి ఉద్యోగులు గ‌మ‌నించి వారించినా.. బుచ్చిరెడ్డిపాలెం పోలీసులు మాత్రం కనీసం పట్టించుకోలేదని, ఈ దారుణాన్ని సాధారణ “గుండెపోటు” మరణంగా చిత్రీకరించి కేసును నీరుగార్చేందుకు తీవ్రంగా ప్రయత్నించారని కుటుంబ స‌భ్యులు ఆరోపించారు. ఒక వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మరణించినప్పుడు కనీసం పోస్టుమార్టం నిర్వహించి, అసలు కారణాలు తెలుసుకోవడంపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ.. బాధితులు చివరకు జిల్లా ఎస్పీ గ్రీవెన్స్‌ను ఆశ్రయించడంతో అసలు బండారం బ‌య‌ట‌ప‌డింది.

ప్రాథమిక విచారణలో పోలీసుల నిర్ల‌క్ష్యం బ‌య‌ట‌ప‌డ‌డంతో ఎస్పీ అనిత వేజెండ్ల బుచ్చిరెడ్డిపాలెం పీఎస్ పరిధిలోని సీఐ మాతంగి శ్రీనివాసరావు, ఎస్సై సంతోష్ రెడ్డిల‌ను వీఆర్‌కు పంపుతూ, మొత్తం 23 మంది సిబ్బందిని ఒకేసారి బదిలీ చేయ‌డం సంచ‌ల‌నంగా మారింది.

ఇలాంటి ఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌కుండా చూసుకోవాల్సిన బాధ్యత హోం శాఖతో పాటు రాష్ట్ర ప్రభుత్వంపై ఉందంటున్నారు ప్ర‌జ‌లు. ఇప్పటికైనా ప్రభుత్వం పోలీస్ వ్యవస్థలో లోతైన ప్రక్షాళనకు శ్రీకారం చుట్టకపోతే, చట్టంపై జ‌నానికి నమ్మకం స‌న్న‌గిల్లి అరాచక శక్తులు రాజ్యమేలే ప్రమాదం పొంచి ఉందనడంలో ఎలాంటి సందేహం లేదని అభిప్రాయ‌ప‌డుతున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment