“ప్రభుత్వంలో దుబారా తగ్గించాలి.. మంత్రులు ఆడంబరాలకు దూరంగా ఉండాలి” – ఇది సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) కేబినెట్ భేటీలో మంత్రులకు ఇచ్చిన ఆదేశం. ఇకపై ప్రత్యేక విమానాల్లో ప్రయాణాలు ఉండవని కేబినెట్ భేటీ అనంతరం సమాచార శాఖ మంత్రి పార్థసారధి (Parthasaradhi) అధికారికంగా ప్రకటించిన కొద్దిసేపటికే, మరో మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) ఆ నిబంధనలను ఉల్లంఘించడం సంచలనంగా మారింది. ప్రభుత్వం పొదుపు మంత్రం జపిస్తున్న వేళ, కొద్ది నిమిషాల్లోనే లోకేష్ ప్రత్యేక విమానంలో పర్యటించడం చర్చనీయాంశంగా మారింది.
కేబినెట్ భేటీ ముగిసిన వెంటనే ‘స్పెషల్ ఫ్లైట్’
ప్రధానమంత్రి నరేంద్రమోడీ (Narendra Modi) పిలుపు మేరకు పొదుపు చర్యలు పాటించాలని ఏపీ కేబినెట్ (AP Cabinet) నిర్ణయించిన వెంటనే, లోకేష్ తన పర్యటన కోసం ప్రత్యేక విమానాన్ని (VT-CVB) ఆశ్రయించారు. అమరావతి నుంచి శ్రీ సత్యసాయి జిల్లాకు ఆయన ప్రత్యేక విమానంలో వెళ్లారు. ఒకవైపు ప్రధాని మోడీ సైతం ఆర్థిక భారాలపై అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నా, లోకేష్ మాత్రం అవేవీ పట్టించుకోకుండా విలాసవంతమైన ప్రయాణానికే మొగ్గు చూపడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
పుట్టపర్తిలో భారీ కాన్వాయ్..
కేవలం విమాన ప్రయాణంతోనే ఆగకుండా, పుట్టపర్తి నుంచి ధర్మవరం వెళ్లేందుకు లోకేష్ భారీ కాన్వాయ్‌ను వినియోగించారు. “జిల్లాల పర్యటనల్లో కాస్ట్ కటింగ్ పాటించాలి, వాహనాల సంఖ్య తగ్గించాలి” అన్న కేబినెట్ నిర్ణయానికి విరుద్ధంగా ఈ పర్యటన సాగడం గమనార్హం.
సోషల్ మీడియాలో ట్రోల్స్.. నెటిజన్ల ప్రశ్నలు
లోకేష్ విమాన ప్రయాణానికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. “టీడీపీ నాయకులు రూల్స్ చెబుతారు కానీ, పాటించరు” అంటూ నెటిజన్లు ఎద్దేవా చేస్తున్నారు. “ముఖ్యమంత్రికి ప్రోటోకాల్, భద్రతా కారణాల దృష్ట్యా ప్రత్యేక విమానం అవసరం ఉండవచ్చు. కానీ, ఒక మంత్రిగా లోకేష్‌కు అంతటి అత్యవసర పరిస్థితి ఏముంది?” అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
బాధ్యతాయుతమైన పదవిలో ఉండి, ఇలా ప్రజా ధనాన్ని దుబారా చేస్తూ ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు. మంత్రి పార్థసారధి పొదుపు చర్యల గురించి మైకులో చెబుతుండగానే, లోకేష్ ఆకాశంలో విహరించడం ప్రభుత్వ ద్వంద్వ నీతికి నిదర్శనమని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. మరి ఈ విమర్శలపై ప్రభుత్వం లేదా నారా లోకేష్ ఎలా స్పందిస్తారో చూడాలి.








వైసీపీలోకి రేపల్లె కీలక నేత.. జగన్ సంచలన హామీ