టాలీవుడ్లో నాగార్జున(Nagarjuna), టబు(Tabu) జోడీకి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ముఖ్యంగా ‘నిన్నే పెళ్లాడతా’ (Ninne Pelladatha) సినిమాతో ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్న ఈ జంట.. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత మరోసారి వెండితెరపై సందడి చేయబోతోంది. నాగార్జున నటిస్తున్న ప్రతిష్టాత్మక 100వ చిత్రం ‘కింగ్ 100’లో(King 100) టబు కీలక పాత్రలో నటిస్తున్నారు. తాజాగా ఆమె పాత్రకు సంబంధించిన ఆసక్తికరమైన అప్డేట్ను చిత్రబృందం ప్రకటించింది. నవంబర్ 4న ఉదయం 9 గంటలకు టబు ఫస్ట్ లుక్ గ్లింప్స్‌ను(First Look Glimpse) విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. ఈ సందర్భంగా విడుదల చేసిన ప్రమోషనల్ వీడియోలో పాతకాలం నాటి రేడియో, చీరకట్టులో టబు నడుచుకుంటూ వెళ్తున్న దృశ్యాలు ఆసక్తిని పెంచుతున్నాయి.
అయితే ఈ ప్రమోషనల్ వీడియోలో కనిపించిన ‘దిస్ టైమ్.. ఇట్స్ నాట్ లవ్’ (This Time.. It’s Not Love) (ఈసారి ప్రేమ కాదు) అనే క్యాప్షన్ ఇప్పుడు సినిమా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. గతంలో నాగార్జున, టబు జోడీ అంటే రొమాంటిక్ కెమిస్ట్రీ(Romantic Chemistry) గుర్తుకొస్తుంది. కానీ ఈ సినిమాలో మాత్రం వీరిద్దరి మధ్య భిన్నమైన అనుబంధాన్ని దర్శకుడు ఆర్.ఏ. కార్తీక్ (R.A. Karthik)చూపించబోతున్నట్లు ఈ ప్రచార వీడియో సంకేతాలిస్తోంది. దీంతో టబు పాత్ర ఎలా ఉండబోతోంది? నాగార్జునతో ఆమెకు ఎలాంటి సంబంధం ఉండబోతోంది? అనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది.








