‘మొంథా’ తుఫాన్ ప్రభావం.. కాకినాడ తీరంలో హై అల‌ర్ట్‌

‘మొంథా’ తుఫాన్ ప్రభావం.. కాకినాడ తీరంలో హై అల‌ర్ట్‌

బంగాళాఖాతం (Bay of Bengal)లో ఏర్పడి ప్రస్తుతం వేగంగా బలపడుతున్న ‘మొంథా’ (‘Montha’) తుఫాన్ (Cyclone) ప్రభావం ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) తీర ప్రాంతాలపై తీవ్ర ఆందోళనను కలిగిస్తోంది. వాతావ‌ర‌ణ శాఖ వివ‌రాల ప్ర‌కారం.. ఈ తుఫాన్ మరికొన్ని గంటల్లో తీవ్ర తుఫాన్‌గా మారే అవకాశం ఉంది. ప్రస్తుతం గంటకు 6 కి.మీ. వేగంతో వాయుగుండం కదులుతూ, కాకినాడ సమీప తీరాన్ని ఎల్లుండి ఉదయానికి దాటే అవకాశం ఉందని ప్రకటించారు.

కాకినాడలో అప్రమత్తం
తుఫాన్ ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని కాకినాడ (Kakinada) జిల్లా యంత్రాంగం పూర్తిస్థాయిలో అప్రమత్తమైంది. వచ్చే ఐదు రోజుల పాటు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు (Schools) సెలవులు (Holidays) ప్రకటించారు. సాంఘిక, సంక్షేమ హాస్టళ్లలో ఉన్న విద్యార్థులను తల్లిదండ్రులు ఇళ్లకు తీసుకువెళ్తున్నారు. మత్స్యకారులు సముద్రంలో వేటను నిలిపివేశారు. కాకినాడ మునిసిపల్‌ కమిషనర్‌ ప్రకటన ప్రకారం, 14 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు.

పోర్టులో మూడవ ప్రమాద హెచ్చరిక
కాకినాడ పోర్టులో ఇప్పటికే మూడవ ప్రమాద హెచ్చరిక జారీ కాగా, ఉప్పాడ–కాకినాడ బీచ్ రోడ్డులో రాకపోకలు నిలిపివేశారు. సూర్యాపేట, ఎన్టీఆర్ బీచ్‌లను కూడా పోలీసులు మూసివేశారు. తీరంలో ప్రస్తుతం 35 నుండి 55 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచుతున్నాయి. తుఫాన్ తీరం దాటే సమయంలో గరిష్టంగా గంటకు 90–110 కి.మీ వేగంతో గాలులు వీసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

నాలుగు రోజులపాటు భారీ వర్షాలు
తీవ్ర తుఫాన్ ప్రభావంతో కాకినాడ తీరంలో సాధారణం కంటే ఒక మీటర్ ఎత్తులో అలలు ఎగసిపడే అవకాశం ఉంది. రాష్ట్రవ్యాప్తంగా వచ్చే నాలుగు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రేపు కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా. అదేవిధంగా శ్రీకాకుళం, మన్యం, విజయనగరం, విశాఖ, అల్లూరి, అనకాపల్లి, తూర్పు గోదావరి జిల్లాల్లో అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

అంతే కాకుండా ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, నంద్యాల, అన్నమయ్య, కడప, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కూడా అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తీర ప్రాంతాల వారు సముద్రం వైపు వెళ్లరాదని అధికారులు సూచించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment