కస్టడీలో కొట్టి చంపడం ఘోర‌మైన నేరం.. – హైకోర్టు సంచలన తీర్పు

కస్టడీలో కొట్టి చంపడం ఘోర‌మైన నేరం.. - హైకోర్టు సంచలన తీర్పు

“కస్టడీలో ఉన్న వ్యక్తిని కొట్టి చంపడం ఏ పోలీస్ అధికారి అధికారిక విధి కాదు.. అది సభ్య సమాజంలో అత్యంత ఘోరమైన నేరం” అంటూ మధ్యప్రదేశ్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. లాకప్‌డెత్ కేసులో నిందితులుగా ఉన్న కొందరు పోలీసులు తమపై క్రిమినల్ చర్యలు తీసుకోకుండా స్టే ఇవ్వాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. జస్టిస్ గజేంద్రసింగ్ ధర్మాసనం ఈ కేసులో పోలీసుల పిటిషన్‌ను పూర్తిగా కొట్టివేస్తూ అత్యంత కీలకమైన తీర్పును వెలువరించింది.

నిందితుల నుంచి నిజాలు వెలికితీసే పేరుతో థర్డ్ డిగ్రీ ప్రయోగించడం, వారిని శారీరకంగా హింసించడం, ఆపై కేసు నుంచి తప్పించుకోవడానికి స్టేషన్ రికార్డులను ఫోర్జరీ చేయడం లాంటి పనులు ఏ చట్టం ప్రకారం కూడా పోలీసుల విధి నిర్వహణకిందకు రావని న్యాయమూర్తి స్పష్టం చేశారు. కస్టోడియల్ మరణాల వంటి నేరాలకు పాల్పడిన పోలీసులను శిక్షించడానికి ప్రభుత్వం నుంచి ఎలాంటి ముందస్తు అనుమతి అవసరం లేదు అని హైకోర్టు తేల్చి చెప్పింది. చట్టాన్ని రక్షించాల్సిన పోలీసులే లాకప్ మరణాలకు కారణం కావడం సభ్య సమాజంలో అత్యంత ఘోరమైన నేరమని, ఇలాంటి వాటిని ఏమాత్రం సహించేది లేదని న్యాయస్థానం హెచ్చరించింది.

ప్రస్తుత పరిస్థితుల్లో ఈ తీర్పు ఎందుకు కీలకం?
ఏపీలో ముఖ్యంగా విజయవాడ కృష్ణలంక పీఎస్ పరిధిలో జనసైనికుడు గాదె సాయికృష్ణ మిస్సింగ్, లాకప్‌డెత్ ఆరోపణలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తున్నాయి. పోలీసులు సాక్ష్యాధారాలు దొరకకుండా మృతదేహాన్ని దహనం చేశారంటూ జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) వరకు ఫిర్యాదులు వెళ్లాయి. ఇలాంటి ఉద్రిక్త పరిస్థితుల మధ్య.. “లాకప్‌డెత్స్ పాల్పడే పోలీసులపై చర్యలకు ప్రభుత్వ పర్మిషన్ అక్కర్లేదు” అంటూ మధ్యప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పు దేశవ్యాప్తంగా పోలీసు వ్యవస్థకు, బాధితులకు ఒక కీలక మైలురాయిగా మారనుంది.

Join WhatsApp

Join Now

Leave a Comment