తెలంగాణలో(Telangana) కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) అమలు చేయాల్సిన ఎన్నికల హామీలపై రాజకీయ వాతావరణం మళ్లీ వేడెక్కింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆరు గ్యారంటీల (Six Guarantees) అమలు జరగకపోవడాన్నికేటీఆర్(KTR) తీవ్రంగా విమర్శించారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో బీఆర్‌ఎస్(BRS) ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో నిర్వహించిన అవగాహన సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ..
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరిస్తూ అసెంబ్లీని కేవలం నాటకాల వేదికగా మార్చిందని ఆరోపించారు. ఈ హామీల అమలుకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తూ బీఆర్‌ఎస్ అసెంబ్లీలో ప్రైవేట్ మెంబర్ బిల్లును (Private Member Bill) ప్రవేశపెట్టనుందని, దీనికి అధికార పార్టీ మద్దతు ఇవ్వాలని కోరారు.
అదే సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) ప్రభుత్వంపై కూడా కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దెబ్బతిన్నప్పటికీ ప్రభుత్వం ‘నైట్ ఎకానమీ’ (Night Economy) వంటి అంశాలపై మాట్లాడటం ప్రజలను మోసం చేయడమేనని అన్నారు.
మూసీ నది ప్రక్షాళన పేరుతో భారీ అవినీతి జరుగుతోందని ఆరోపిస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వం తమ హయాంలో నిర్మించిన ఇళ్లు, ఫ్లైఓవర్లు, ప్రాజెక్టులకు రంగులు పూసి తమ ఘనతగా చూపుకుంటోందని వ్యాఖ్యానించారు. ప్రజలకు ఇచ్చిన హామీల అమలు, రైతు సమస్యలు, మూసీ బాధితుల సమస్యలు వంటి అంశాలపై రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీఆర్‌ఎస్ బలంగా నిలదీయనుందని ఆయన స్పష్టం చేశారు.








