నెల్లూరు జిల్లా(Nellore District) కావలి మున్సిపాలిటీలో(Kavali Municipality) నామినేషన్ల పరిశీలన సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ (YSRCP) అభ్యర్థుల నామినేషన్లను (Nominations) అక్రమంగా తిరస్కరించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆ పార్టీ నేతలు మండిపడ్డారు. టీడీపీ(TDP) ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి(Kavya Krishna Reddy) ఏకంగా రిటర్నింగ్ అధికారి (ఆర్వో) కార్యాలయంలోకి దూసుకెళ్లడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. నామినేషన్ల తిరస్కరణను ప్రశ్నించిన మాజీ ఎమ్మెల్యే, వైసీపీ కావలి ఇన్చార్జి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిపై(Ramireddy Pratap Kumar Reddy) దాడికి ప్రయత్నించారని పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
టీడీపీ ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి సమక్షంలోనే ఆయన అనుచరులు దాడికి ప్రయత్నించారని వైసీపీ నేతలు మండిపడ్డారు. ఓపికగా సమస్య పరిష్కారానికి ప్రయత్నించిన రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే అనుచరుల వ్యవహారశైలితో పాటు పోలీసుల తీరుపైనా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పోలీసుల అండతోనే ఎమ్మెల్యే, ఆయన అనుచరులు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని విమర్శించారు.
వైసీపీ అభ్యర్థుల నామినేషన్లను అక్రమంగా తిరస్కరించేందుకు (Illegal Rejection) అధికారులు ప్రయత్నిస్తున్నారని రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా అధికార పార్టీ నేతలు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన అధికారులు, పోలీసులు అధికార పార్టీకి అండగా నిలవడమేంటని ప్రశ్నించారు. ఇది ప్రజాస్వామ్యమా? అధికార పార్టీ అండతో సాగుతున్న రౌడీయిజమా? అంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.








