చిత్ర పరిశ్రమలో విషాదం.. ‘కింగ్ ఆఫ్ స్క్రీన్ ప్లే’ కన్నుమూత

చిత్ర పరిశ్రమలో విషాదం.. ‘కింగ్ ఆఫ్ స్క్రీన్ ప్లే’ కన్నుమూత

తమిళ చిత్ర పరిశ్రమతో పాటు సౌత్ ఇండియన్ సినిమాలో తనదైన ముద్ర వేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి, ప్రముఖ దర్శకుడు, నటుడు కె. భాగ్యరాజ్ (73) శనివారం ఉదయం కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచారు. ఆయన మరణవార్త విని సినీ ప్రముఖులు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు.

కేవలం నటుడిగానే కాకుండా దర్శకుడిగా, అద్భుతమైన రైటర్‌గా, స్వరకర్తగా, నిర్మాతగా భాగ్యరాజ్ చిత్ర పరిశ్రమలో ఒక వెలుగు వెలిగారు. ఇండియన్ సినిమాలో ఆయన్ను ‘కింగ్ ఆఫ్ స్క్రీన్ ప్లే’ (King of Screenplay) అని పిలుస్తుంటారు. సాధారణ మధ్యతరగతి కుటుంబాల కథలు, సున్నితమైన హాస్యం, సామాజిక అంశాల కలబోతతో ఆయన రూపొందించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలు సాధించాయి.

భాగ్యరాజ్ కేవలం తమిళ చిత్రాలకే పరిమితం కాలేదు. తెలుగు సినీ పరిశ్రమతో కూడా ఆయనకు విడదీయరాని అనుబంధం ఉంది. విక్టరీ వెంకటేష్ నటించిన ఎవర్ గ్రీన్ హిట్ సినిమాలు ‘ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు’, ‘అబ్బాయి గారు’ చిత్రాలకు భాగ్యరాజ్ స్క్రిప్ట్ (కథ) అందించారు. ఈ సినిమాలు తెలుగులో ఎంత పెద్ద విజయం సాధించాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తెలుగులో అల్లరి నరేష్ హీరోగా వచ్చిన ‘పెళ్లైంది కానీ’ సినిమాకు భాగ్యరాజ్ దర్శకుడిగా వ్యవహరించారు.

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్, నాగార్జున నటించిన చిత్రం ‘కుబేర’ లో భాగ్యరాజ్ ఒక ముఖ్య పాత్ర పోషించారు. తెలుగులో నటుడిగా ఇదే ఆయన చివరి చిత్రం కావడం గమనార్హం.

Join WhatsApp

Join Now

Leave a Comment