జమ్మూకాశ్మీర్‌లో (Jammu & Kashmir) మరోసారి ఉగ్రవాదులు (Terrorists) అమాయక పౌరులను లక్ష్యంగా చేసుకున్నారు. దక్షిణ కాశ్మీర్‌లోని (South Kashmir) కుల్గాం జిల్లాలోని (Kellam Area) కెల్లం ప్రాంతంలో ఇటుక బట్టీలో పనిచేస్తున్న ఛత్తీస్‌గఢ్‌కు (Chhattisgarh) చెందిన ఇద్దరు వలస కార్మికులపై ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో దీపక్ అక్కడికక్కడే మృతి చెందగా, తీవ్రంగా గాయపడిన భోపిందర్ను (Bhopinder) ఆసుపత్రికి తరలించినప్పటికీ చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. దాడి అనంతరం ఉగ్రవాదులు అక్కడి నుంచి పరారయ్యారు. దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని దిగ్బంధించి నిందితుల కోసం విస్తృత గాలింపు చర్యలు చేపట్టాయి.
ఈ దాడికి లష్కర్-ఎ-తైబా (LeT) అనుబంధ సంస్థగా భావించే ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (TRF) బాధ్యత వహించినట్లు సమాచారం. ఘటనపై జమ్మూకాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా (Manoj Sinha) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉగ్రవాదులపై ఆపరేషన్లను మరింత వేగవంతం చేయాలని భద్రతా బలగాలను ఆదేశించారు. నిందితులను తప్పకుండా న్యాయస్థానం ముందు నిలబెడతామని స్పష్టం చేశారు. మరోవైపు పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ, ఆప్‌ని పార్టీ అధ్యక్షుడు అల్తాఫ్ బుఖారీ (Altaf Bukhari) సహా పలువురు రాజకీయ నాయకులు ఈ దాడిని ఖండిస్తూ, కుటుంబాల జీవనోపాధి కోసం కాశ్మీర్‌కు వచ్చిన అమాయక వలస కార్మికులను లక్ష్యంగా చేసుకోవడం అమానుషమని పేర్కొని మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.








