దేశ రాజధాని న్యూఢిల్లీ వేదికగా ప్రతిపక్ష INDIA కూటమి అధినేతలు, అగ్రనేతల కీలక సమావేశం జరిగింది. కేంద్ర ఎన్నికల సంఘం (ECI) చేపడుతున్న ఓటర్ల జాబితా ‘ప్రత్యేక సమగ్ర సవరణ’ (SIR) ప్రక్రియలో చోటుచేసుకుంటున్న అక్రమాలు, ఓటర్ల తొలగింపు, ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్‌ను పదవి నుంచి తొలగించేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ భేటీలో ప్రధానంగా చర్చించారు.
ముఖ్య నేతల హాజరు
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, జైరాం రమేశ్, కేసీ వేణుగోపాల్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీతో పాటు ఎన్సీపీ (ఎస్పీ), శివసేన (యూబీటీ), వామపక్షాలు, ఆర్జేడీ సహా పలు కూటమి భాగస్వామ్య పక్షాల అగ్రనేతలు పాల్గొన్నారు.
ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌ను బాధ్యతల నుంచి తొలగించేందుకు రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో తీర్మాన నోటీసు ఇచ్చే అంశంపై నేతలు సుదీర్ఘంగా చర్చించారు. ఎన్నికల కమిషన్ స్వతంత్ర ప్రతిపత్తిని కాపాడటానికి, SIR పేరుతో జరుగుతున్న ఓటర్ల తొలగింపులను నిరసిస్తూ దేశవ్యాప్తంగా ఉమ్మడి నిరసన ప్రదర్శనలు, ర్యాలీలు నిర్వహించాలని నిర్ణయించారు. ఓటర్ల విశ్వసనీయతను కాపాడేందుకు ఓట్ల లెక్కింపు, VVPAT స్లిప్పుల పూర్తి పరిశీలన తదితర డిమాండ్లను సమిష్టిగా లేవనెత్తాలని భావించారు.
కొన్ని పార్టీల దూరంగా.. మద్దతు ప్రకటించిన డీఎమ్‌కే
ఈ సమాజ్ వాదీ పార్టీ (SP) అధినేత అఖిలేష్ యాదవ్ రాజ్యసభ ఎన్నికల ప్రక్రియ సంబంధిత పనుల వల్ల సమావేశానికి నేరుగా హాజరు కాలేకపోవడంతో తమ పార్టీ ప్రతినిధిని పంపారు. ఇక డీఎంకే, ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) నేతలు ఈ భేటీకి దూరంగా ఉన్నప్పటికీ, జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించే అంశంపై పార్లమెంట్లో ప్రతిపక్షాలు తెచ్చే ఏ తీర్మానానికైనా పూర్తి మద్దతు ఇస్తామని డీఎంకే స్పష్టం చేసింది.
ఇటీవల కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) సమావేశంలో ఈ అంశాలపై ఆమోదించిన తీర్మానాల ఆధారంగా, రానున్న రోజుల్లో కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం తీరుపై ‘INDIA’ కూటమి ప్రజాక్షేత్రంలో గళం విప్పడానికి సిద్ధమవుతోంది.








