ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజాకు కాపీరైట్ వివాదంలో సుప్రీంకోర్టులో నిరాశ ఎదురైంది. ‘మూడు పాని’ చిత్రంలోని ప్రముఖ పాట ‘ఎన్ ఇనియ పొన్ నిలవే’కు సంబంధించిన కాపీరైట్ హక్కుల వివాదంలో దిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. దిల్లీ హైకోర్టు ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోవాల్సిన కారణాలు కనిపించడం లేదని స్పష్టం చేసింది. జస్టిస్ జె.బి. పర్దివాలా, జస్టిస్ కె. వినోద్ చంద్రన్‌లతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించింది.
ఈ సందర్భంగా పాటల కాపీరైట్ హక్కులకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక విషయాలను స్పష్టం చేసింది. సినిమాలోని పాటకు సంగీతం సమకూర్చినందుకు ఇళయరాజాకు స్వరపరిచిన సంగీతంపై మాత్రమే కాపీరైట్ హక్కులు ఉంటాయని పేర్కొంది. పాటలోని సాహిత్యంపై గేయ రచయితకు, సౌండ్ రికార్డింగ్‌పై సంబంధిత నిర్మాత లేదా రికార్డింగ్ లేబుల్‌కు హక్కులు ఉంటాయని వివరించింది. ఈ విభాగాలపై ఇళయరాజాకు కాపీరైట్ హక్కులు ఉండవని పేర్కొన్న దిల్లీ హైకోర్టు తీర్పును సమర్థిస్తూ సుప్రీంకోర్టు ఆయన అప్పీల్‌ను తిరస్కరించింది. దీంతో ‘ఎన్ ఇనియ పొన్ నిలవే’ పాటకు సంబంధించిన కాపీరైట్ వివాదంలో మ్యూజిక్ లేబుల్ ‘సరిగమ’కు ఊరట లభించింది.








