హైదరాబాద్ నగరంలో అర్ధరాత్రి వేళ తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. తెలంగాణకు చెందిన సీనియర్ జర్నలిస్ట్ కేవీ రెడ్డి (KVR)ని అరెస్ట్ చేసేందుకు ఆంధ్రప్రదేశ్ పోలీసులు భారీగా తరలిరావడం కలకలం రేపింది. బొబ్బిలికి చెందిన పోలీసులు కేవీఆర్ నివాసానికి చేరుకోగా, తోటి జర్నలిస్టులు, తెలంగాణ ఉద్యమకారులంతా ఏకమై ఏపీ పోలీసులను నిలదీసిన తీరు చర్చనీయాంశంగా మారింది.
అసలు ఏం జరిగింది?
ఏపీలోని అధికార పార్టీ నేతలు ‘రెడ్ బుక్’ రాజ్యాంగం అమలు చేస్తామని ప్రకటించగా, జర్నలిస్ట్ కేవీఆర్ విశ్లేషణ చేస్తూ ఆ పదాన్ని ‘ఎర్రిబుక్’ అని సంబోధించారు. అయితే, ఈ పదాన్ని ఒక బూతు పదంగా చిత్రీకరిస్తూ టీడీపీ నేతలు ఫిర్యాదు చేయడంతో బొబ్బిలి పోలీసులు వెంటనే కేసు నమోదు చేశారు. హడావిడిగా హైదరాబాద్‌కు వెళ్లి జర్నలిస్టు కేవీఆర్‌ను అరెస్టు చేసే ప్రయత్నం చేశారు. కనీస ముందస్తు సమాచారం లేకుండా, అర్ధరాత్రి వేళ ఇంట్లో మహిళలు, పిల్లలు ఉన్నారని కూడా చూడకుండా పోలీసులు కేవీఆర్ ఇంట్లోకి ప్రవేశించడం విమర్శలకు దారితీసింది. విషయం తెలుసుకున్న జర్నలిస్టులు, ఉద్యమకారులంతా ఏకమై కేవీఆర్ ఇంటికి చేరుకొని ఏపీ పోలీసులను నిలదీయడం సంచలనంగా మారింది.
జర్నలిస్టుల డిమాండ్
ఏ కేసులో కేవీఆర్‌ను అరెస్ట్ చేస్తున్నారో స్పష్టమైన ఆధారాలు చూపాలని డిమాండ్ చేశారు. ఏ లోకల్ పోలీసుల అనుమతి తీసుకొని కేవీఆర్ ఇంటికి వచ్చారని ప్రశ్నించారు. అర్థరాత్రి పూట నిబంధనలకు విరుద్ధంగా జర్నలిస్టుల ఇళ్లపై పడమని ఎవరు చెప్పారు అని ప్రశ్నించారు. తెలంగాణ జర్నలిస్టుల హక్కులను కాలరాస్తే ఐక్యంగా పోరాడతామని జర్నలిస్ట్ సంఘాలు ఏపీలోని చంద్రబాబు సర్కార్‌కు స్పష్టమైన హెచ్చరికలు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది.
‘తెలంగాణ గడ్డపైకి వచ్చి అరెస్ట్ చేస్తారా?’ – పృథ్వీరాజ్ యాదవ్ ధ్వజం
ఈ ఘటనపై తెలంగాణ ఉద్యమకారుడు పృథ్వీరాజ్ యాదవ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. “గతంలోనే కేవీఆర్‌ను కర్నూలుకు తీసుకెళ్లి చిత్రహింసలు పెట్టారు. ఇప్పుడు మళ్ళీ దొంగ కేసులు పెట్టి ఎన్‌కౌంటర్ చేయాలని చూస్తున్నారా?” అని ప్రశ్నించారు. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ శని, ఆదివారాలు హైదరాబాద్‌లోనే ఉంటారని.. తెలంగాణ బిడ్డలపై ఇలాగే అక్రమ కేసులు పెడితే వారిని హైదరాబాద్‌లో అడుగు పెట్టనివ్వబోమని హెచ్చరించారు.
క్విట్ తెలంగాణ ఉద్యమం వస్తుంది: జర్నలిస్ట్ శంకర్
సీనియర్ జర్నలిస్ట్ శంకర్ మాట్లాడుతూ ఏపీ పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. “మా సొమ్ము తిని, మా గడ్డ మీద ఉంటూ మా బిడ్డలనే అరెస్ట్ చేస్తారా? ఏపీలోని రెడ్ బుక్ రాజ్యాంగాన్ని తెలంగాణకు పాకించాలని చూస్తే సహించేది లేదు. ఇదే కొనసాగితే చంద్రబాబుకు వ్యతిరేకంగా ‘క్విట్ తెలంగాణ’ ఉద్యమం మళ్ళీ మొదలవుతుంది” అని హెచ్చరించారు.








