హైదరాబాద్‌కు చెందిన గోల్డ్ మ్యాన్ యాదగిరి చిన్న గౌడ్ అలియాస్ దర్గా చిన్న పహిల్వాన్ కుటుంబానికి ఆదాయపు పన్ను శాఖ షాక్ ఇచ్చింది. ఆయన కుటుంబానికి సంబంధించిన ఆస్తి వ్యవహారంలో బినామీ నిరోధక విభాగం కీలక చర్యలు చేపట్టింది. రాయదుర్గంలోని నవ ఖల్సా గ్రామంలో ఉన్న భారీ అపార్ట్‌మెంట్‌ను బినామీ ఆస్తిగా అనుమానిస్తూ తాత్కాలికంగా అటాచ్ చేసింది. ఈ భవనం కొనుగోలు, నిర్మాణానికి సంబంధించిన నిధుల మూలాలపై విచారణ జరిపిన అధికారులు పలు కీలక విషయాలను గుర్తించారు.
2019 జూలైలో 222 చదరపు గజాల స్థలాన్ని రూ.26.70 లక్షలకు కొనుగోలు చేశారు. అనంతరం అక్కడ గ్రౌండ్ ఫ్లోర్‌తో పాటు ఐదు అంతస్తుల భవనాన్ని నిర్మించారు. అయితే ఈ ఆస్తి ప్రణయ్ గౌడ్ పేరుతో రిజిస్టర్ అయినప్పటికీ, స్థలం కొనుగోలు, భవన నిర్మాణానికి ఆయన బావ డబ్బులు సమకూర్చినట్లు విచారణలో వెల్లడైనట్లు అధికారులు గుర్తించారు. అప్పట్లో ప్రణయ్ గౌడ్ విద్యార్థిగా ఉండటం, సొంత ఆదాయ వనరులు లేకపోవడం కూడా అధికారుల అనుమానాలకు కారణమైంది.
మరోవైపు, ఈ అపార్ట్మెంట్ నుంచి నెలకు సుమారు రూ.3.20 లక్షల అద్దె ఆదాయం వస్తుండగా, ఆ మొత్తం ప్రణయ్ గౌడ్ ఖాతాలో కాకుండా ఆయన బావ భార్య బ్యాంకు ఖాతాలో జమ అవుతున్నట్లు దర్యాప్తులో గుర్తించారు. ఈ ఆధారాలతో ప్రణయ్ గౌడ్‌ను బినామీదారుడిగా, ఆయన బావను అసలు లబ్ధిదారుడిగా పేర్కొంటూ ఆదాయపు పన్ను శాఖ జాయింట్ కమిషనర్ నవంబర్ 17న బినామీ నిరోధక చట్టం-1988లోని సెక్షన్ 24(4)(a) కింద తాత్కాలిక అటాచ్మెంట్ ఉత్తర్వులు జారీ చేశారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఆస్తి విక్రయం, బదిలీపై ఆంక్షలు ఉంటాయి.








