ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో మహిళా సాధికారత(Women Empowerment, డ్వాక్రా (DWACRA) సంఘాల చుట్టూ మరోసారి అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం ముదిరింది. కూటమి ప్రభుత్వ హయాంలో (Coalition Government) మహిళల ఆర్థిక ప్రగతి, ఆత్మగౌరవం పెరిగిందని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత (Vangalapudi Anitha) స్పష్టం చేయగా.. గత ప్రభుత్వ హయాంలోనే మహిళలకు నిజమైన మేలు జరిగిందంటూ వైసీపీ గణాంకాలు బయటపెడుతోంది.
మహిళలకు ఆర్థిక గౌరవం – హోంమంత్రి
మహానాడు వేదికగా సాగిన చర్చలను ప్రస్తావిస్తూ హోంమంత్రి అనిత తెలుగుదేశం పార్టీ (TDP) అనుసరించిన మహిళా విధానాలను కొనియాడారు. రాష్ట్రంలో కోటి మంది మహిళలతో డ్వాక్రా (DWACRA) సంఘాలు నేడు విరాజిల్లుతున్నాయంటే దానికి పునాది టీడీపీనేనని, ఏ రాజకీయ పార్టీ కూడా ఈ వ్యవస్థను టచ్ చేసే ప్రయత్నం చేయలేనంత బలంగా స్వయం సహాయక సంఘాలు తయారయ్యాయని ఆమె పేర్కొన్నారు. స్వర్గీయ ఎన్టీఆర్(NTR) హయాంలో మహిళలకు ఆస్తి హక్కు కల్పించి ఆత్మగౌరవం పెంచితే.. చంద్రబాబు నాయుడు హయాంలో డ్వాక్రా ద్వారా వారికి ఆర్థిక గౌరవం దక్కిందని అన్నారు. ఈసారి మహానాడును మహిళలకు అంకితం చేస్తూ ‘స్త్రీ శక్తి’ (Stree Shakti) థీమ్‌తో నిర్వహించారని, ఇది కేవలం రాజకీయ సభ కాదు.. ఒక ఎమోషన్ అని అనిత అభివర్ణించారు.
గతం కంటే రుణాలు పడిపోయాయి.. వైసీపీ
హోంమంత్రి అనిత వ్యాఖ్యలపై వైసీపీ శ్రేణులు తీవ్రంగా మండిపడుతున్నాయి. గతంలో డ్వాక్రా రుణమాఫీ (DWACRA Loan Waiver) చేస్తానని చెప్పి చంద్రబాబు మహిళలను వంచించారని వారు ఆరోపిస్తున్నారు. వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నాలుగు విడతల్లో ‘వైఎస్సార్ ఆసరా’(YSR Aasara) ద్వారా డ్వాక్రా సంఘాల పాత బకాయిలన్నింటినీ ప్రభుత్వమే చెల్లించి, వారిని మళ్లీ ‘A’ గ్రేడ్‌లోకి తీసుకువచ్చిందని గుర్తుచేశారు.
జగన్ పాలనలో బ్యాంక్ లింకేజీ రుణాలు ఏటా పెరుగుతూ 2023-24 నాటికి రికార్డు స్థాయిలో రూ. 49,626 కోట్లకు చేరితే.. నేడు చంద్రబాబు (Chandrababu) కూటమి ప్రభుత్వంలో నాబార్డు (NABARD) నివేదిక ప్రకారం అది కేవలం రూ. 30,698 కోట్లకు పడిపోయిందని వైసీపీ లెక్కలను చూపిస్తోంది. దీనికి హోంమంత్రి ఏం సమాధానం చెబుతారని వారు ప్రశ్నిస్తున్నారు.
శాంతిభద్రతలపై విమర్శలు
రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలు, నేరాలు పెరిగిపోతుంటే.. హోంమంత్రిగా బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న అనిత క్షేత్రస్థాయిలో కఠిన చర్యలు తీసుకోవడం లేదని ప్రతిపక్షం విమర్శిస్తోంది. బాధితులకు న్యాయం చేయడం పక్కన పెట్టి, కేవలం చంద్రబాబు భజన చేసుకుంటూ పబ్బం గడుపుకుంటున్నారంటూ వైసీపీ శ్రేణులు ధ్వజమెత్తాయి.
ఎన్నికల సమయంలో ఇచ్చిన ‘ఆడబిడ్డ నిధి’(Aadabidda Nidhi) హామీ అమలు ఎక్కడంటూ ప్రశ్నిస్తూ.. డ్వాక్రా మహిళలు, మహిళా సంరక్షణ, మహిళల ఆర్థిక స్వావలంబనకు బాటలు పడిందే వైఎస్ జగన్ హయాంలో అని, దిశ యాప్, దిశ పోలీస్ స్టేషన్లు ఎక్కడున్నాయని వైసీపీ శ్రేణులు ప్రశ్నలు వేస్తున్నాయి.








ముద్రగడకు పవన్ గవర్నర్ పదవి ఇద్దామన్నారు