అమెరికాలో(America) భారీ మ్యారేజ్ ఫ్రాడ్ స్కామ్ (Marriage Fraud Scam) గుట్టురట్టైంది. గ్రీన్ కార్డ్ (Green Card) పొందేందుకు విదేశీయులతో నకిలీ వివాహాలు ఏర్పాటు చేస్తున్న అంతర్జాతీయ ముఠాపై అమెరికా న్యాయశాఖ (DOJ), యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (USCIS) సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్‌లో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ వ్యవహారంలో న్యూయార్క్‌కు (New York) చెందిన 11 మంది ప్రధాన నిందితులను అధికారులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. చైనా, ఫ్లోరిడా, జార్జియా, టెన్నెస్సీ, వనాటు తదితర ప్రాంతాలకు సంబంధించిన నకిలీ వివాహాల నెట్‌వర్క్‌ను (Fake Marriage Network) ఈ ముఠా నిర్వహించినట్లు దర్యాప్తులో గుర్తించారు.
గ్రీన్ కార్డ్ కోసం ప్రయత్నించే విదేశీయుల నుంచి ఒక్కొక్కరి వద్ద దాదాపు లక్ష డాలర్ల (Around $100,000) వరకు వసూలు చేసినట్లు అధికారులు గుర్తించారు. నకిలీ పెళ్లిళ్ల కోసం అమెరికన్లను రిక్రూట్ చేసిన మధ్యవర్తులకు ఒక్కో వివాహానికి సుమారు 5 వేల డాలర్ల కమిషన్ చెల్లించగా, పెళ్లికి అంగీకరించిన అమెరికన్లకు 30 వేల డాలర్ల వరకు ఇచ్చినట్లు సమాచారం. ఈ ముఠా ఇప్పటివరకు 1,000కుపైగా నకిలీ వివాహాలు నిర్వహించి ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. ఇమ్మిగ్రేషన్ వ్యవస్థను (Immigration System) మోసం చేసి అక్రమంగా గ్రీన్ కార్డులు పొందేందుకు సహకరించిన వారిపై మరింత లోతుగా దర్యాప్తు కొనసాగుతోంది.







