ఖరీదైన ముడిచమురు (Crude Oil) సెగ బంగారానికి (Gold) తగిలింది. ద్రవ్యోల్బణం భయాలు, అంతర్జాతీయ రాజకీయ ఉద్రిక్తతల మధ్య సోమవారం పసిడి ధరలు భారీగా పతనమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో(International Market) బంగారం ధరలు సోమవారం భారీగా క్షీణించాయి. స్పాట్ గోల్డ్ ధర 1 శాతం మేర తగ్గి, ఔన్సు (Ounce) బంగారం ధర 4,667.99 డాలర్ల వద్దకు చేరింది. ముడిచమురు ధరలు పెరగడం వల్ల ద్రవ్యోల్బణం (Inflation) పెరుగుతుందన్న ఆందోళనలు, దానికి తగ్గట్టుగా వడ్డీ రేట్లు కూడా ఎక్కువ కాలం పాటు గరిష్ట స్థాయిలోనే ఉంటాయన్న సంకేతాలు పసిడి పతనానికి కారణమయ్యాయి.
ట్రంప్ – ఇరాన్ ప్రతిష్టంభన
అమెరికా – ఇరాన్ (America-Iran) మధ్య గత 10 వారాలుగా సాగుతున్న యుద్ధాన్ని ముగించేందుకు జరిగిన శాంతి చర్చలు విఫలమయ్యాయి. ఇరాన్ పంపిన శాంతి ప్రతిపాదనలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) ఆదివారం తిరస్కరించారు. ఇరాన్ డిమాండ్లు ఏమాత్రం అంగీకారయోగ్యంగా లేవని ఆయన స్పష్టం చేయడంతో, మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు కొనసాగుతాయని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.
ముడిచమురు సెగ
యుద్ధం ఇప్పట్లో ముగిసేలా లేదన్న వార్తలతో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధరలు బ్యారెల్‌కు 103 డాలర్ల పైకి చేరాయి. హార్ముజ్ జలసంధి (Strait of Hormuz) ద్వారా రవాణా స్తంభించిపోవడంతో చమురు ధరలు ఎగిశాయి. చమురు ధరలు పెరిగితే ద్రవ్యోల్బణం పెరుగుతుంది. ద్రవ్యోల్బణాన్ని అరికట్టడానికి ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచుతుంది. వడ్డీ రేట్లు పెరిగితే, ఎలాంటి వడ్డీ ఆదాయం ఇవ్వని బంగారంపై పెట్టుబడులు తగ్గుతాయి. ఫలితంగా ధరలు పడిపోతాయి.
యుద్ధం మొదలైన ఫిబ్రవరి చివరి వారం నుంచి ఇప్పటివరకు బంగారం ధరలు సుమారు 11 శాతం మేర పడిపోయాయి. ఒకవైపు డాలర్ బలపడటం కూడా ఇతర దేశాల కరెన్సీల్లో బంగారం కొనేవారికి భారాన్ని పెంచింది. ప్రస్తుతం పెట్టుబడిదారులు అందరూ మంగళవారం విడుదల కానున్న అమెరికా వినియోగదారుల ధరల సూచీ గణాంకాల కోసం ఎదురుచూస్తున్నారు.








