సీఎం సొంత జిల్లాలో గంజాయి బ్యాచ్ అరాచకం.. భయాందోళనలు

సీఎం సొంత జిల్లాలో గంజాయి బ్యాచ్ అరాచకం.. భయాందోళనలు

Summarize with AI

ముఖ్యమంత్రి (Chief Minister) సొంత జిల్లాలోనే గంజాయి మాఫియా (Ganja Mafia) అరాచకం ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోంది. ఉమ్మ‌డి చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని (Chandragiri Constituency) రెడ్డివారిపల్లెలో గంజాయి బ్యాచ్‌ ఆగడాలు రోజురోజుకు మితిమీరిపోతున్నాయి. అర్ధరాత్రి వేళ గ్రామంలో తిరుగుతూ అక్రమ కార్యకలాపాలకు పాల్పడుతున్న ఈ గుంపు, ఇటీవల ఒక ఇంటిని ధ్వంసం చేయడమే కాకుండా, టూ వీలర్‌కు నిప్పు పెట్టే ప్రయత్నం చేయడంతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

గ్రామస్తుల కథనం ప్రకారం, రెడ్డివారిపల్లెలో గంజాయి బ్యాచ్ తరచూ గొడవలకు దిగుతూ భయాందోళనలు సృష్టిస్తోంది. గతంలో లిక్విడ్ గంజాయి వ్యవహారం కూడా ఈ గ్రామంలో కలకలం రేపిందని, అప్పటి నుంచే కొంతమంది అక్రమాలకు పాల్పడుతూ గ్రామ శాంతిని భంగం చేస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. ముఖ్యంగా అర్ధరాత్రి సమయంలో అక్రమ ఇసుక, గ్రావెల్ రవాణా కోసం తిరుగుతూ గ్రామస్తులతో ఘర్షణలకు దిగుతున్నారని ఆరోపిస్తున్నారు.

ఈ ఘటనలపై పోలీసులకు పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ, ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల నిర్లక్ష్య ధోరణి కారణంగా గంజాయి మాఫియా మరింత రెచ్చిపోతుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

జల్లికట్టును అడ్డుకునేందుకు పోలీసులు చూపిన శ్రద్ధ గంజాయి నిర్మూలన, అక్రమ ఇసుక, గ్రావెల్ రవాణాపై ఎందుకు చూపించడంలేదని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. జల్లికట్టు పేరుతో ప్రత్యేక బలగాలను మోహరించి, చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి ఎద్దులను వెనక్కి పంపిన పోలీసులు, గ్రామంలో జరుగుతున్న గంజాయి అక్రమాలపై మాత్రం మౌనం పాటించడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ముఖ్యమంత్రి సొంత జిల్లాలోనే ఈ స్థాయిలో గంజాయి మాఫియా అరాచకం కొనసాగుతుండటం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని గ్రామస్తులు విమర్శిస్తున్నారు. వెంటనే గంజాయి బ్యాచ్‌పై కఠిన చర్యలు తీసుకుని, గ్రామంలో శాంతి భద్రతలు పునరుద్ధరించాలని వారు పోలీసు శాఖను, ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment