తెలంగాణలో (Telangana) నకిలీ డీఏపీ ఎరువుల (Fake DAP Fertilizers) వ్యవహారం సంచలనంగా మారింది. రైతులను(Farmers) లక్ష్యంగా చేసుకుని అసలైన డీఏపీ బస్తాల మాదిరిగానే నకిలీ ఎరువులను విక్రయిస్తున్న ముఠాపై రాష్ట్ర ప్రభుత్వం (State Government) సీరియస్ అయింది. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ చేపట్టాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి (సీఎస్) (CS) అధికారులను ఆదేశించగా, పోలీసులు కూడా ప్రత్యేక దర్యాప్తు ప్రారంభించారు.
ప్రాథమిక విచారణలో ఈ నకిలీ ఎరువులు కర్ణాటకలో(Karnataka) తయారై తెలంగాణలోని పలు జిల్లాలకు సరఫరా అయినట్లు గుర్తించారు. రైతులకు అనుమానం రాకుండా బస్తాలపై ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) ఫొటోను(Photo) ముద్రించి విక్రయించడం కలకలం రేపుతోంది.
వికారాబాద్ జిల్లా (Vikarabad District) పూడూర్ మండలం మంచన్పల్లిలో అధికారులు నిర్వహించిన తనిఖీల్లో 106 నకిలీ డీఏపీ బస్తాలు స్వాధీనం చేసుకోగా, పరిగి మండలం చిగురాల్పల్లిలో (Chiguralpalli) 25 మంది రైతులు మొత్తం 275 నకిలీ బస్తాలు కొనుగోలు చేసినట్లు తేలింది. ఇప్పటికే కొందరు రైతులు ఈ ఎరువులను పొలాల్లో వినియోగించగా, వారి చేతులకు బొబ్బలు వచ్చినట్లు సమాచారం.
స్వాధీనం చేసుకున్న బస్తాలను పోలీస్ స్టేషన్లకు తరలించి కేసు నమోదు చేసిన అధికారులు, ఈ దందా వెనుక కొంతమంది సర్పంచ్లు (Sarpanches) సహా మరికొందరి ప్రమేయం ఉందా అనే కోణంలో విచారణ కొనసాగిస్తున్నారు. రైతులు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద ఎరువుల విక్రయాలపై వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని వ్యవసాయ శాఖ సూచించింది.








