ఐ బొమ్మ (iBomma) వెబ్సైట్ నిర్వాహకుడు రవి (Ravi) కేసు దర్యాప్తులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ కేసులోకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) (Enforcement Directorate – ED) ఎంటర్ అయ్యింది. ఐ బొమ్మ వ్యవహారంలో పెద్ద ఎత్తున మనీ లాండరింగ్ జరిగి ఉండవచ్చని అనుమానిస్తున్న ఈడీ అధికారులు, రవి కేసు వివరాలను, ఆర్థిక లావాదేవీల సమాచారాన్ని అందించాల్సిందిగా కోరుతూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌కు అధికారికంగా లేఖ రాశారు.
రవి తన ఐబొమ్మ సైట్లో బెట్టింగ్ యాప్ (Betting Apps)లను ప్రచారం చేయడం ద్వారా కోట్లాది రూపాయలు సంపాదించాడని ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో, అతని బ్యాంక్ ఖాతాకు విదేశీ ఖాతాల నుండి భారీ మొత్తంలో నిధులు బదిలీ అయ్యాయని, ఇందులో ఇప్పటికే పోలీసులు ఫ్రీజ్ చేసిన రూ.3.5 కోట్లు కూడా ఉన్నాయని అధికారులు గుర్తించారు.
ఈడీ దర్యాప్తులో అత్యంత కీలకంగా మారిన అంశం ఏమిటంటే, రవి NRE (నాన్-రెసిడెంట్ ఎక్స్టర్నల్) ఖాతాకు నెలకు సుమారు రూ.15 లక్షలు క్రిప్టో వాలెట్ ద్వారా బదిలీ అయినట్లు గుర్తించడం. ఈ అసాధారణమైన లావాదేవీలు మరియు వాటికి బెట్టింగ్ యాప్‌లతో ఉన్న లింక్‌పై ఈడీ సమగ్ర దర్యాప్తు చేయనుంది. ఇప్పటికే బెట్టింగ్ యాప్‌ల కేసులపై పలువురు సినీ ప్రముఖులను విచారిస్తున్న ఈడీ, రవి ఖాతాకు కూడా బెట్టింగ్ నిర్వాహకుల నుంచి డబ్బు వచ్చిందని అనుమానిస్తోంది. ఈ ట్రాన్సాక్షన్స్‌ను లోతుగా పరిశీలించడం ద్వారా కేసులో మరిన్ని ముఖ్యమైన విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.








