సైబరాబాద్ పరిధిలో ఆహార భద్రత ప్రమాణాల అమలుపై ఫుడ్ సేఫ్టీ అధికారులు విస్తృత స్థాయిలో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పుప్పాలగూడలోని కంచి కేఫ్‌ను తనిఖీ చేసిన అధికారులు పలు లోపాలను గుర్తించారు. ముఖ్యంగా కిచెన్, స్టోర్‌రూమ్ మధ్య ఓపెన్ డస్ట్‌బిన్‌లు ఉండటం, పరిశుభ్రత ప్రమాణాలను పాటించకపోవడం వంటి అంశాలను నమోదు చేశారు. ఆహార పదార్థాల తయారీ, నిల్వ విధానాలపై కూడా అధికారులు సమగ్రంగా పరిశీలించి నిర్వాహకులకు సూచనలు జారీ చేశారు.
అదే సమయంలో నల్లగండ్లలోని ప్రముఖ కోడికూర చిట్టిగారె హోటల్‌లోనూ ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో లేబుల్స్ లేని ఆహార పదార్థాలు నిల్వ ఉంచినట్లు గుర్తించారు. ఆహార పదార్థాల తయారీ తేదీలు, గడువు తేదీలు వివరాలు లేకపోవడాన్ని అధికారులు తీవ్రంగా పరిగణించారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఆహార భద్రత నిబంధనలను కచ్చితంగా పాటించాలని హోటల్ యాజమాన్యాలకు హెచ్చరికలు జారీ చేశారు. నిబంధనల ఉల్లంఘన కొనసాగితే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు.








