తమిళనాడు రాజకీయాలు (Tamil Nadu Politics) రోజురోజుకూ మరింత వేడెక్కుతున్నాయి. అధికార పక్షమైన టీవీకే(TVK), ప్రతిపక్ష డీఎంకే (DMK)మధ్య మాటల యుద్ధం ఇప్పుడు వ్యక్తిగత విమర్శల దాకా వెళ్లింది. అసెంబ్లీలో గవర్నర్ (Governor) ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై జరిగిన చర్చలో ముఖ్యమంత్రి విజయ్(CM Vijay) డీఎంకే ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి (Corruption), ప్రజాధన దుర్వినియోగంపై (Misuse of Public Funds) తీవ్ర విమర్శలు గుప్పించారు. తమ ప్రభుత్వం పారదర్శక పాలనకు కట్టుబడి ఉందని, ప్రజల సొమ్మును దుర్వినియోగం చేసే పరిస్థితి ఉండదని స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు తమిళ రాజకీయాల్లో పెద్ద దుమారానికే దారితీశాయి.
విజయ్ వ్యాఖ్యలకు డీఎంకే నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ (Udhayanidhi Stalin) ఘాటుగా స్పందించారు. రైతుల (Farmers) ఆందోళనల వెనుక ప్రతిపక్షాల హస్తం ఉందని ప్రభుత్వం చెబుతుండటం రైతాంగాన్ని అవమానించడమేనని మండిపడ్డారు. అయితే రాజకీయ విమర్శలకే పరిమితం కాకుండా విజయ్ వ్యక్తిగత జీవితాన్ని ప్రస్తావించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టులో (Chengalpattu Family Court) విచారణలో ఉన్న విజయ్-సంగీత (Vijay-Sangeetha) దంపతుల విడాకుల వ్యవహారాన్ని (Divorce Case) ఉదయనిధి ప్రస్తావించడంతో రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. వ్యక్తిగత అంశాలను రాజకీయ వేదికపైకి తీసుకురావడంపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలా ఉండగా, అసెంబ్లీలో విజయ్ మాజీ సీఎం స్టాలిన్ హావభావాలను అనుకరించడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై ఉదయనిధి వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ.. అసెంబ్లీని థియేటర్‌గా మార్చేశారని, ముఖ్యమంత్రి పాత్రలో నటించడం మానేసి పాలనపై దృష్టి పెట్టాలని విమర్శించారు. స్పీకర్ (Speaker) యాక్షన్ చెబితే సీఎం నటిస్తున్నట్లుగా ఉందని, త్వరలో మేకప్ ఆర్టిస్టులు, స్టంట్ మాస్టర్లు కూడా అసెంబ్లీలో కనిపిస్తారేమో అంటూ సెటైర్లు వేశారు. దీంతో తమిళ రాజకీయాల్లో టీవీకే-డీఎంకే మధ్య పోరు మరింత ఉత్కంఠగా మారింది. రానున్న రోజుల్లో ఈ రాజకీయ యుద్ధం ఇంకెంత దూరం వెళ్తుందో అన్న ఆసక్తి రాష్ట్రవ్యాప్తంగా నెలకొంది.







