బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పుల ఘటనకు సంబంధించి నిందితుల అరెస్టుపై ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. షూటర్లను పట్టుకున్నందుకు సంబరపడుతున్నవారు అండర్‌వరల్డ్ వ్యవస్థ ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవాలని ఆయన తన ఎక్స్ (X) ఖాతాలో పేర్కొన్నారు.
అండర్‌వరల్డ్‌లో కాల్పులు జరిపే వ్యక్తులు సులభంగా భర్తీ చేయగలిగే వారని, వారి పాత్ర తాత్కాలికమేనని అభిప్రాయపడ్డారు. ఒక నిర్దిష్ట పని పూర్తయిన తర్వాత షూటర్ల అవసరం ముగుస్తుందని, అందుకే నేర వ్యవస్థలో వారికి తక్కువ ప్రాధాన్యం ఉంటుందని విశ్లేషించారు. షూటర్లను ఒక భవన నిర్మాణంలో పనిచేసే కూలీలతో పోల్చిన వర్మ.. కూలీలు భవనాన్ని నిర్మించడంలో భాగస్వాములైనా, దాని రూపకల్పన చేయరు, యజమానులూ కారని పేర్కొన్నారు. అదేవిధంగా నేరానికి పాల్పడాలని ఆదేశాలు ఇచ్చేవారు, ఎవరిని లక్ష్యంగా చేసుకోవాలో నిర్ణయించేవారే అసలైన సూత్రధారులని వ్యాఖ్యానించారు.
తన అభిప్రాయాన్ని వివరించేందుకు రామ్‌గోపాల్ వర్మ సైనిక వ్యవస్థను కూడా ఉదాహరణగా ప్రస్తావించారు. యుద్ధంలో రాజులు, సైన్యాధిపతులు నేరుగా పోరాడరని, సైనికులే యుద్ధరంగంలో ప్రాణాలకు తెగించి పోరాడతారని అన్నారు. అయితే, సైన్యాన్ని, అండర్‌వరల్డ్‌ను ఒకే కోణంలో చూడటం తన ఉద్దేశం కాదని స్పష్టం చేశారు. నిర్ణయాలు తీసుకునే వ్యక్తులు ప్రమాదానికి దూరంగా ఉండేలా వ్యవస్థలు పనిచేస్తాయనే విషయాన్ని వివరించడమే తన ఉద్దేశమని తెలిపారు. అండర్వరల్డ్లోనూ ఉన్నతస్థాయిలో ఉన్న వ్యక్తులు స్వయంగా నేరాలకు పాల్పడకుండా, ఇతరులను ఉపయోగించుకుంటారని ఆయన అభిప్రాయపడ్డారు. షూటర్లను అరెస్టు చేయడం మాత్రమే సరిపోదని, వారి వెనుక ఉన్న నెట్వర్క్, ఆదేశాలు ఇచ్చిన వ్యక్తులు, అసలు సూత్రధారులపై దర్యాప్తు జరగాల్సిన అవసరాన్ని ఆయన వ్యాఖ్యలు పరోక్షంగా ప్రస్తావించాయి.
టైగర్ ష్రాఫ్‌పై జరిగిన కాల్పుల ఘటన బాలీవుడ్లో భద్రతపై ఆందోళనలను పెంచిన నేపథ్యంలో వర్మ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. షూటర్ల అరెస్టుతోనే నేర వ్యవస్థ పూర్తిగా బలహీనపడిందని భావించలేమని, వెనుక ఉన్న కీలక వ్యక్తులు, నెట్‌వర్క్‌ను గుర్తించడం కూడా ముఖ్యమని ఆయన అభిప్రాయపడ్డారు. షూటర్లను పట్టుకోవడం పోలీసులకు పెద్ద విజయమని లేదా అండర్వరల్డ్కు అంతిమ నష్టమని చెప్పలేమంటూ వ్యాఖ్యానించారు. అందుకే బాలీవుడ్‌పై భయం ఇంకా కొనసాగుతోందని పేర్కొన్నారు.








