కుటుంబ విషయాలను కూడా రాజకీయం చేస్తూ, టీడీపీ మీడియా ప్రజలను తప్పుదోవ పట్టించేలా రాతలకు వైసీపీ గట్టి కౌంటర్ ఇచ్చింది. చెల్లెలు షర్మిలకు వైఎస్ జగన్ అక్టోబర్ 9వ తేదీన రాసిన లేఖను తాజాగా విడుదల చేశారు. అంజిలి (జిలీ) వివాహం తన బెంగళూరు నివాసంలో జరగడంపై వస్తున్న తప్పుడు ఊహాగానాలకు, టీడీపీ అనుకూల మీడియా చేస్తున్న దుష్ప్రచారానికి ఈ లేఖ ద్వారా పూర్తిగా తెరపడింది.
లేఖలోని ముఖ్యాంశాలు ఇవే..
“అంజిలి పెళ్లి గురించి తెలిసి నాకు చాలా సంతోషంగా ఉంది. గత ఏడేళ్లుగా మన మధ్య ఎన్ని పరిణామాలు జరిగినా, అంజిలి జీవితాంతం సంతోషంగా, ప్రేమానురాగాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను” అంటూ జగన్ తన లేఖను ప్రారంభించారు. జిలీ చిన్నప్పటి నుంచి పెరుగుతూ రావడాన్ని తాను చూశానని, ఆమెకు అంతా మంచే జరగాలని ఆకాంక్షించారు.
భద్రతాపరమైన తీవ్ర ఆందోళనలు
తన అభ్యంతరాలను పట్టించుకోకుండా బెంగళూరులోని తన నివాసంలోనే పెళ్లి నిర్వహించాలని షర్మిల భావించడంపై జగన్ స్పష్టతనిచ్చారు. “పెళ్లి వంటి వేడుకకు పెద్ద సంఖ్యలో ప్రజలు, క్యాటరింగ్ సిబ్బంది, ఈవెంట్ మేనేజర్లు, ఫోటోగ్రాఫర్లు, అతిథులు ఇలా ఎంతోమంది వస్తారు. వీరిలో చాలామంది మనకు పరిచయం లేనివారే ఉంటారు. ఇంతమంది నివాస ప్రాంగణంలోకి రాకపోకలు సాగించడం వల్ల తీవ్రమైన భద్రతాపరమైన సమస్యలు తలెత్తుతాయి” అని వివరించారు.
వ్యక్తిగత గోప్యతకు భంగం
నివాస ప్రాంగణానికి, చుట్టుపక్కల ప్రాంతాలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు బయటకు వెళ్లడం తన కుటుంబ భద్రతకు, వ్యక్తిగత గోప్యతకు తీవ్ర ముప్పుగా మారుతుందని, ఈ నిర్ణయం తీసుకోవడం తనకు అంత సులభం కాలేదని స్పష్టం చేశారు. “ఇది నా ఇల్లు. ఇక్కడ నేను, నా కుటుంబం సురక్షితంగా ఉండేలా చూసుకోవాలనుకుంటున్నాను. హర్ష లేదా వర్ష పెళ్లి అయినా నేను ఇదే నిర్ణయం తీసుకునేవాడిని” అని పేర్కొన్నారు.
ప్రత్యామ్నాయ వేదికల సూచన
బెంగళూరు నివాసానికి బದಲು వేరే వేదికను ఎంచుకోవాలని షర్మిలకు జగన్ హితవు పలికారు. “రాజా పెళ్లికి చేసినట్లుగా కన్వెన్షన్ సెంటర్లో గానీ, డెస్టినేషన్ వెడ్డింగ్ వేదికలో గానీ పెళ్లి నిర్వహించుకోవచ్చు. ఆ వేదికలు ఇష్టం లేకపోతే హైదరాబాద్లోని నా ‘లోటస్ పాండ్’ ఆస్తిని వివాహం కోసం ఉపయోగించుకోవడానికి నా అభ్యంతరం లేదు. ఆ ప్రతిపాదన ఇప్పటికీ అలాగే ఉంది” అని స్పష్టం చేశారు. జిలీ పెళ్లి ఆమె జీవితంలో అత్యంత ఆనందకరమైన రోజుగా నిలిచిపోవాలని కోరుకుంటూ, తన దృక్కోణాన్ని అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
అందుకే లేఖ విడుదల చేస్తున్నాం – వైసీపీ
స్థానిక ఎన్నికల నామినేషన్లలో సీఎం చంద్రబాబు రాష్ట్రాన్ని రావణకాష్టంగా మార్చారని వైసీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. చంద్రబాబు చేయించిన దాడులతో రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా కుప్పకూలిపోయాయని పేర్కొంది. రాష్ట్రంలోని పరిస్థితులపై ప్రజాస్వామ్యవాదులు, జర్నలిస్టులు, తటస్థులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారని, ఆ వాస్తవాలను కప్పిపుచ్చేందుకు జగన్ వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని వైసీపీ మండిపడింది. ప్రజలకు తప్పుడు సమాచారం వెళ్లకూడదనే షర్మిలకు వైఎస్ జగన్ రాసిన లేఖను విడుదల చేస్తున్నామని పేర్కొంది.








