రెండు కీలక సమయాల్లో చంద్రబాబు మౌనం.. బీజేపీ పెద్దల్లో మళ్లీ అనుమానాలు!

రెండు కీలక సమయాల్లో చంద్రబాబు మౌనం.. బీజేపీ పెద్దల్లో మళ్లీ అనుమానాలు!

Summarize with AI

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్య‌క్షుడు నారా చంద్రబాబు నాయుడి రాజకీయ వైఖరిపై మరోసారి జాతీయ స్థాయిలో, ముఖ్యంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అగ్రనాయకత్వంలో తీవ్ర అనుమానాలు రేకెత్తుతున్నాయి. 2024 ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుని, కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నప్పటికీ.. కీలకమైన జాతీయ సమస్యలు ఎదురైనప్పుడు చంద్రబాబు అనుసరిస్తున్న ‘సందర్భానుకూల మౌనం’ బీజేపీ పెద్దలకు మింగుడు పడటం లేదనే చర్చ నడుస్తోంది.

ఇటీవల జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వాన్ని, బీజేపీని డిఫెన్స్‌లో పడేసిన రెండు ప్రధాన పరిణామాల్లో ఎన్డీఏ కీలక భాగస్వామిగా ఉన్న చంద్రబాబు స్పందించిన తీరు అనేక అనుమానాలకు తావిస్తోంది.

‘నీట్’ వ్యవహారంలో మిన్నకుండిపోయిన బాబు
దేశవ్యాప్తంగా ‘నీట్’ (NEET) పరీక్షా వివాదం, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్లు, ప్రతిపక్షాల ఆందోళనలతో ఢిల్లీ వేడెక్కిన సమయంలో చంద్రబాబు నోరు మెదపలేదు. ప్రతిపక్షాలు కేంద్రంపై విరుచుకుపడుతుంటే, ఎన్డీఏలో భాగస్వామిగా ఉండి కేంద్రానికి గట్టిగా మద్దతుగా నిలవాల్సిన బాబు.. అసలు తనకు సంబంధమే లేనట్లు మౌనం దాల్చారు. ఆయన కేంద్ర నిర్ణయాలకు అనుకూలమా? లేక వ్యతిరేకమా? అనే సంకేతాన్ని కూడా ఇవ్వకపోవడం గమనార్హం.

ఎలక్షన్ కమిషన్ వివాదంలోనూ..
కేంద్ర ఎన్నికల సంఘం (ECI)పై జాతీయ స్థాయిలో విమర్శలు, ప్రతిపక్షాల నెగిటివ్ ప్రచారం హోరెత్తినప్పుడు కూడా చంద్రబాబు వెంటనే కేంద్రానికి, ఈసీకి మద్దతుగా నిలబడలేదు. మూడు-నాలుగు రోజులు సైలెంట్‌‌గా ఉండి, పరిస్థితులు ఒక కొలిక్కి వచ్చిన తర్వాత కానీ ఆయన స్పందించలేదు. ఈ ఆలస్యపు రియాక్షన్ వెనుక ఆయన రాజకీయం ఏంటనేది బీజేపీ వర్గాల్లో ప్రశ్నగా మారింది.

2014 దోస్తీ.. ఆపై దూషణలు.. 2024లో మళ్లీ పోగ‌డ్త‌లు
చంద్రబాబు రాజకీయ చరిత్రను గమనిస్తున్న బీజేపీ పెద్దలు ఆయనను పూర్తిగా నమ్మడానికి సిద్ధంగా లేరని ఢిల్లీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. 2014లో బీజేపీతో కలిసి పోటీ చేసి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు, 2018 వచ్చేసరికి ఎన్డీఏ నుంచి బయటకు వచ్చి ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మోదీని వ్యక్తిగతంగా, అసభ్యకర రీతిలో విమర్శిస్తూ కాంగ్రెస్‌తో జతకట్టారు.

2024 ఎన్నికల నాటికి మళ్లీ వైఖరి మార్చుకుని మోదీ జపం చేస్తూ ఎన్డీఏ కూటమిలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చాక ప్రధాని మోదీపై విపరీతమైన పొగ‌డ్త‌ల‌తో భ‌జ‌న‌ చేస్తున్నార‌నే ఆరోప‌ణ‌లున్నప్పటికీ.. అవసరమైన సమయంలో మాత్రం మౌనంగా ఉంటూ స్వార్థ రాజకీయాలు చేస్తున్నారన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది.

‘గోడ మీద పిల్లి’ వైఖరిపై శ్రేణుల్లోనూ చర్చ!
సొంత ప్రయోజనాల కోసం ఎప్పుడైనా జంప్ చేసే స్వభావం చంద్రబాబుదని, ఆయనను నమ్మడానికి వీల్లేదని గతంలోనే పలు సందర్భాల్లో రుజువైందని బీజేపీ అంతర్గత చర్చల్లో అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది. కేంద్రంలో ముప్పు వస్తే తన బాధ్యత లేనట్లు పక్కకు తప్పుకోవడం, పరిస్థితి అనుకూలిస్తే క్రెడిట్ తీసుకోవడం చంద్రబాబు నైజమని విమర్శకులు అంటున్నారు. కేంద్ర ప్రభుత్వానికి నిజమైన మిత్రుడిగా నిలబడకుండా ‘గోడ మీద పిల్లి’లా వ్యవహరిస్తున్న చంద్రబాబుపై బీజేపీ అధిష్టానం కూడా లోలోపల కన్ను వేసి ఉంచిందనే వార్తలు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment