దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన అయోధ్య రామ మందిరం కానుకల దొంగతనం కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసును మరింత వేగంగా, పారదర్శకంగా విచారించేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కొత్త ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేయడానికి సిద్ధమవుతోంది. ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం, కొత్త సిట్ ఏర్పాటుపై అధికారిక ప్రకటన ఈరోజు లేదా రేపటిలో వెలువడే అవకాశం ఉంది. ఈ కేసులో వాస్తవాలను వెలికితీసి, సమగ్ర దర్యాప్తు చేపట్టడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యంగా తెలుస్తోంది.
సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా సీనియర్ ఐపీఎస్ అధికారి నేతృత్వంలో ఈ సిట్ పనిచేయనున్నట్లు సమాచారం. లక్నో రేంజ్ ఐజీ కిరణ్ ఎస్.ను సిట్ చీఫ్‌గా నియమించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. అలాగే ఆర్థిక, పరిపాలన శాఖలకు చెందిన పలువురు సీనియర్ అధికారులను కూడా ఈ బృందంలో చేర్చే అవకాశం ఉందని సమాచారం. ప్రభుత్వం అధికారికంగా సిట్‌ను ప్రకటించిన తర్వాత సభ్యుల వివరాలతో పాటు దర్యాప్తు విధానంపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు.








