అధికార కూటమి నేతల మధ్య విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా రెండో విడత అన్న క్యాంటీన్ల (Anna Canteens) ప్రారంభోత్సవ కార్యక్రమాలు (Inauguration Programs) జరుగుతుండగా, అవనిగడ్డలో మాత్రం ప్రొటోకాల్ వివాదం (Protocol Controversy) కారణంగా తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. దీంతో ప్రారంభం కావాల్సిన అన్న క్యాంటీన్ కాస్తా.. నేతల మధ్య గొడవకు వేదికైంది.
అన్న క్యాంటీన్ ప్రారంభోత్సవం కోసం ఏర్పాటు చేసిన శిలాఫలకంపై ఏఎంసీ (AMC) ఛైర్మన్ కొల్లూరి వెంకటేశ్వరరావు (Kolluri Venkateswara Rao) పేరు లేకపోవడంతో వివాదం మొదలైంది. తమ నాయకుడి పేరు లేకుండా ప్రారంభోత్సవం ఎలా చేస్తారంటూ ఆయన అనుచరులు, వర్గీయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్న క్యాంటీన్ వద్ద ఉన్న శిలాఫలకాన్ని (Foundation Stone) బలవంతంగా పీకేశారు. అంతటితో ఆగకుండా, ఆ బోర్డును సమీపంలోని పంట కాలువలో పడేసేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో అక్కడే ఉన్న అవనిగడ్డ నియోజకవర్గ టీడీపీ (TDP) పరిశీలకడు కనపర్తి శ్రీనివాస్ (Kanaparthi Srinivas) జోక్యం చేసుకుని వారిని అడ్డుకున్నారు.
పార్టీ కోసం అహర్నిశలు కష్టపడుతుంటే, పదవిలో ఉన్నా కూడా కనీసం ప్రొటోకాల్ పాటించకుండా కుల వివక్ష చూపుతున్నారని వెంకటేశ్వరరావు వర్గం మండిపడింది. శిలాఫలకం వద్దే బైఠాయించిన కార్యకర్తలు ప్రభుత్వానికి, స్థానిక అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ క్రమంలో అన్న క్యాంటీన్ సిబ్బందితో కూడా ఆందోళనకారులు గొడవకు దిగారు. నేతల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొనడం, ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడంతో పరిస్థితి చేయి దాటిపోయింది. దీంతో అన్న క్యాంటీన్ ప్రారంభోత్సవం నిలిచిపోయింది. ప్రజలకు సేవ చేయాల్సిన క్యాంటీన్, ఇలా పార్టీల అంతర్గత కుమ్ములాటలకు బలికావడంపై స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.








