తాడిపత్రి రాజకీయంగా మరోసారి ఉద్రిక్తంగా మారింది. మార్కెట్ యార్డ్ మాజీ వైస్ చైర్మన్, వైసీపీ నేత ఆర్సీ ఓబుల్ రెడ్డిపై ఉదయం దాడి జరిగింది. ఈ ఘటన ఐశ్వర్య విల్లాస్ బైపాస్ సమీపంలో చోటుచేసుకుంది. వాకింగ్ చేస్తున్న సమయంలో కొందరు దుండగులు కాపుకాసి జరిపిన దాడిలో తీవ్రంగా గాయపడిన ఓబుల్ రెడ్డిని స్థానికులు తాడిపత్రి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
గాయాల తీవ్రత కారణంగా ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. దాడి జరిగిన విషయం తెలిసిన మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆస్పత్రికి వెళ్లి పరిస్థితిని తెలుసుకున్నారు. ఓబుల్ రెడ్డిపై దాడి చేసింది జేసీ వర్గీయులేనని చెబుతుండడం గమనార్హం. ఓబుల్ రెడ్డిపై దాడి వెనుక రాజకీయ కోణమే కారణమని కేతిరెడ్డి వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా, తాడిపత్రిలో టీడీపీ – వైసీపీ పోటీతో ఎప్పుడూ వేడెక్కుతుంటుంది. ఈ దాడి ఆ రాజకీయ నేపథ్యానికి సంబంధించినదేనా అనే దిశగా విచారణ జరుగుతోంది.
దాడి చేసిన వారు హెల్మెట్లు ధరించి బైక్‌లపై వచ్చి దాడి చేసి అక్కడి నుంచి పరారైనట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.








