‘అసైన్డ్ కేసు’లో చంద్రబాబుకు షాక్.. ఆర్కే రీఎంట్రీ

'అసైన్డ్ కేసు'లో చంద్రబాబుకు షాక్.. ఆర్కే రీఎంట్రీ

Summarize with AI

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu)పై నమోదైన అసైన్డ్ భూముల కేసు (Assigned Lands Case) ముగింపు ప్రక్రియకు కీలక మలుపు తిరిగింది. ఈ కేసును “మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్” (Mistake of Fact) కింద ఆంధ్రప్రదేశ్ సీఐడీ ఆధ్వ‌ర్యంలో మూసివేత‌ ద‌శ‌లో ఉండ‌గా, మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (Alla Ramakrishna Reddy) అడ్డుకట్ట వేశారు.

అసైన్డ్ భూముల కేసు నేపథ్యం
2014-19 కాలంలో అమరావతి (Amaravati)ని రాజధానిగా నిర్ణయించే ముందు, దళితులకు కేటాయించిన అసైన్డ్ భూములను పెద్ద ఎత్తున కొనుగోలు చేశారనే ఆరోపణలతో ఈ కేసు నమోదు అయింది. ఈ కేసులో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రి పి. నారాయణ (P. Narayana) ప్రధాన ముద్దాయిలుగా పేర్కొనబడ్డారు. ఈ వ్యవహారంపై అప్పట్లో మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదు చేశారు. దానిపై సీఐడీ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది.

కేసు ముగింపు ప్రయత్నం
మ‌ళ్లీ చంద్ర‌బాబు ప్ర‌భుత్వం వ‌చ్చిన త‌రువాత ప్రస్తుతం సీఐడీ ఈ కేసును “మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్” కింద ముగించేందుకు చర్యలు చేపట్టింది. ఈ మేరకు ఫిర్యాదుదారుడైన ఆళ్ల రామకృష్ణారెడ్డికి నోటీసు జారీ చేసింది. అయితే, తాను ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా నమోదు అయిన ఎఫ్‌ఐఆర్‌పై పూర్తి స్థాయి విచారణ జరగాల్సిందేనని ఆయన స్పష్టం చేస్తున్నారు.

ఏసీబీ కోర్టులో పిటిషన్
ఈ కేసును పూర్తిస్థాయిలో విచారణ జరపాలని కోరుతూ ఆళ్ల రామకృష్ణారెడ్డి ఏసీబీ కోర్టు (ACB Court)లో పిటిషన్ దాఖలు చేశారు. తన వాదనలు వినకుండా ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వకూడదని న్యాయమూర్తిని కోరనున్నట్లు తెలిపారు. ఆయన తరఫున న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ వాదనలు వినిపించనున్నారు. ఇప్పటివరకు చంద్రబాబు నాయుడుపై నమోదైన కేసుల్లో ఫిర్యాదుదారుడు స్వయంగా ఏసీబీ కోర్టును ఆశ్రయించడం ఇదే మొదటిసారి కావడం విశేషం. ఈ పరిణామం కేసు ముగింపు ప్రక్రియపై ప్రభావం చూపే అవకాశముందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

హైకోర్టులోనూ విచారణ
ఈ కేసు అంశం ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కూడా విచారణలో ఉంది. కొన్ని వందల ఆధారాలతో కేసు నమోదు చేసిన సీఐడీ ఇప్పుడు ఆధారాలు లేవని పేర్కొంటూ కేసు మూసివేయాలనుకోవడం ప్రశ్నార్థకమని ఆళ్ల రామకృష్ణారెడ్డి వర్గం అంటోంది. ఈ పరిణామాల నేపథ్యంలో అసైన్డ్ భూముల కేసు మళ్లీ రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఏసీబీ కోర్టు తీర్పు ఎలా ఉండబోతుందన్న ఆసక్తి నెలకొంది.

Join WhatsApp

Join Now

Leave a Comment