జగన్ పాల‌న‌ మేలంటున్న ఉద్యోగ సంఘాలు..!

జగన్ పాల‌న‌ మేలంటున్న ఉద్యోగ సంఘాలు..!

Summarize with AI

ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh) ఉద్యోగుల సమస్యలు (Employees Issues) మరోసారి రాజకీయ చర్చకు కేంద్రంగా మారుతున్నాయి. గత వైసీపీ ప్రభుత్వ (YSRCP Government) హయాంలో ఉద్యోగులకు డీఏలు పెండింగ్‌లో(DA Pending) లేవని, పీఆర్సీ అమలు (PRC Implementation) సహా పలు అంశాల్లో తమకు మేలు జరిగిందని ఉద్యోగ సంఘాల నేతలు (Employees Unions Leaders) పేర్కొంటున్నారు. మరోవైపు కూటమి ప్రభుత్వం (Alliance Government) అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతున్నా తమ సమస్యలు పరిష్కారం కావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఉద్యోగుల బకాయిలు, పీఆర్సీ కమిషన్, ఐఆర్‌, డీఏలు, సరెండర్‌ లీవ్‌లు తదితర సమస్యలపై ఏపీజేఏసీ అమరావతి (APJAC Amaravati) ఉద్యమ కార్యాచరణకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో విజయవాడలో(Vijayawada) మీడియాతో మాట్లాడిన ఏపీజేఏసీ అమరావతి ఛైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు(Bopparaju Venkateswarlu) కీలక వ్యాఖ్యలు చేశారు.

గత ప్రభుత్వ హయాంలో డీఏలు పెండింగ్‌లో లేవని బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్ర‌క‌టించ‌డం సంచ‌ల‌నంగా మారింది. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం (YS Jagan Government) అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యోగులకు పీఆర్సీ అమలు చేసిందని గుర్తుచేసుకుంటున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో తాము ఎలాంటి ఇబ్బందులు పడలేదని ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయని పేర్కొన్నారు.

ప్రస్తుతం కూటమి ప్రభుత్వం పీఆర్సీ కమిషన్‌ను (PRC Commission) ఎందుకు ఏర్పాటు చేయడం లేదని ప్రశ్నించారు. ఉద్యోగులకు ఎంత బకాయి ఉందో స్పష్టంగా పే స్లిప్‌లలో చూపించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల సరెండర్‌ లీవ్‌లకు (Surrender Leaves) సంబంధించి దాదాపు రూ.10 వేల కోట్ల బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. పోలీసులకు 15 టీఏలు కూడా పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు. ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

“మాకు ఏ ప్రభుత్వం ఉన్నా ఒక్కటే. ఎవరు అధికారంలో ఉంటే వారినే అడుగుతున్నాం. మీకు చేతకాదా చెప్పండి” అంటూ చంద్ర‌బాబు ప్రభుత్వాన్ని (Chandrababu Government) ఉద్దేశించి వ్యాఖ్యానించారు. తమ ఉద్యమాన్ని పక్కదారి పట్టించేందుకు కొందరు రకరకాలుగా మాట్లాడుతున్నారని బొప్పరాజు ఆరోపించారు. అలాంటి వారి వ్యాఖ్యలను తాము పట్టించుకోబోమని స్పష్టం చేశారు. తాము ఎలాంటి తప్పులు చేయలేదని, ఉద్యోగుల ఉద్యమ సదస్సులో ఏం చెప్పారో దానికే కట్టుబడి ఉన్నామని తెలిపారు.

ఉద్యోగులకు జీతాలు(Salaries), పెన్షనర్లకు పింఛన్లు(Pensions) ప్రతి నెలా ఒకటో తేదీన అందించడం ప్రభుత్వ ప్రాథమిక బాధ్యత అని పేర్కొన్నారు. ఒకటో తేదీన జీతాలు ఇస్తే.. మిగిలిన సమస్యలపై ఉద్యోగులు ప్రశ్నించకూడదా అని ఆయన ప్రశ్నించారు. గత ప్రభుత్వ హయాంలో తాము ఎన్ని ఉద్యమాలు చేసినా ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాలేదని బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. 92 రోజుల పాటు ఉద్యమం చేసినా తమను ఎవరూ అడ్డుకోలేదని గుర్తుచేశారు. ప్రస్తుత ప్రభుత్వంలో ఇంకా ఉద్యమం ప్రారంభం కాకముందే తమపై విమర్శలు చేస్తున్నారని అన్నారు.

ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఏపీజేఏసీ అమరావతి (APJAC Amaravati) ఇప్పటికే మూడు దశల్లో ఉద్యమ కార్యాచరణ ప్రకటించిన విషయం తెలిసిందే. సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసే దిశగా ఉద్యోగ సంఘాలు అడుగులు వేస్తున్నాయి. కూటమి ప్రభుత్వం ఉద్యోగుల బకాయిలు, పీఆర్సీ, ఐఆర్‌, డీఏలు, సరెండర్‌ లీవ్‌లు తదితర అంశాలపై స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ పరిణామాలతో చంద్రబాబు ప్రభుత్వంపై ఉద్యోగుల్లో అసంతృప్తి పెరుగుతోందన్న చర్చ రాజకీయ వర్గాల్లో మొదలైంది.

Join WhatsApp

Join Now

Leave a Comment