ఏపీలో విచిత్ర వాతావరణం.. ఒకవైపు ఎండలు.. మరోవైపు పిడుగులు

ఏపీలో విచిత్ర వాతావరణం.. ఒకవైపు ఎండలు.. మరోవైపు పిడుగులు

ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh) విభిన్నమైన వాతావరణ పరిస్థితులు తలెత్తాయి. రాష్ట్రంలో ఒకవైపు భానుడు (Sun) తన ప్రతాపం చూపిస్తూ ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయికి చేరుస్తుంటే.. మరోవైపు అకస్మాత్తుగా ఆకాశం మేఘావృతమై ఈదురుగాలులు(Strong Winds), పిడుగులతో (Lightning) కూడిన వర్షాలు (Rains)కురుస్తున్నాయి. రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ నివేదికల ప్రకారం, రాబోయే మరో మూడు రోజుల పాటు ఏపీలో ఇదే విధమైన భిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగే అవకాశం ఉందని తెలుస్తోంది.

గూడూరులో అత్యధికంగా 44.6 డిగ్రీలు రికార్డు!
రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం పలు జిల్లాల్లో ఎండ (Heat) తీవ్రత తీవ్ర రూపం దాల్చింది. గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు వివరాలు ఇలా ఉన్నాయి. నెల్లూరు జిల్లా గూడూరు 44.6 డిగ్రీలు (రాష్ట్రంలోనే అత్యధికం), పశ్చిమగోదావరి (తణుకు) 43.7 డిగ్రీలు, పల్నాడు (పిడుగురాళ్ల) 43.3 డిగ్రీలు, కృష్ణా (కానుమోలు), మన్యం (సాలూరు) 43.1 డిగ్రీలు, ప్రకాశం (కరేడు) 43.0 డిగ్రీలు, విజయనగరం (రాజాం) 42.7 డిగ్రీలు, అనకాపల్లి (రాజాం) 42.6 డిగ్రీలు, బాపట్ల (పిట్టలవానిపాలెం), ఏలూరు (నారాయణపురం), తిరుపతి (పూలతోట) 42.3 డిగ్రీల ఉష్ణోగ్ర‌త్త‌లు న‌మోద‌య్యాయి.

రేపు ఎక్కడెక్కడ వర్షాలంటే..
రాబోయే 24 గంటల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ (Meteorological Department) హెచ్చరించింది. పోలవరం, తూర్పుగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, మార్కాపురం, కర్నూలు, నంద్యాల ప్రాంతాల్లో వర్షం పడే సమయంలో పిడుగులు పడే ప్రమాదం ఎక్కువగా ఉన్నందున గ్రామీణ ప్రాంతాల ప్రజలు, రైతులు, గొర్రెల కాపరులు చెట్ల కింద నిలబడకుండా సురక్షిత ప్రాంతాల్లో ఆశ్రయం పొందాలని అధికారులు సూచిస్తున్నారు.

కొన్ని జిల్లాల్లో 44 డిగ్రీల సెగలు
వర్షాల ముప్పు ఉన్నప్పటికీ, ఉత్తర కోస్తా మరియు మరికొన్ని జిల్లాల్లో ఎండల తీవ్రత కొనసాగనుంది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, కాకినాడ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో గరిష్ఠంగా 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. అనకాపల్లి, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 42 డిగ్రీల వరకు రికార్డు కావచ్చు.

Join WhatsApp

Join Now

Leave a Comment