నిత్యావసర ధ‌ర‌లు.. ప‌ట్టించుకునే నాథుడెవ‌రు..?

నిత్యావసర ధ‌ర‌లు.. ప‌ట్టించుకునే నాథుడెవ‌రు..?

Summarize with AI

ఆంధ్రప్రదేశ్‌లో సామాన్య, మధ్యతరగతి ప్రజల బతుకుదెరువు అగ్గిలో గుగ్గిలమవుతోంది. ఆకాశాన్నంటుతున్న నిత్యావసర వస్తువుల ధరలు సగటు జీవికి తీవ్ర ఆర్థిక భారాన్ని మోపుతున్నాయి. జ‌గ‌న్ హ‌యాంలో కరోనా వంటి ప్రపంచ మహమ్మారి విజృంభించిన కాలంలో కూడా లేని ధ‌ర‌లు.. చంద్ర‌బాబు ప్ర‌భుత్వంలో విపరీతంగా పెరిగిపోవడం, వాటిని అదుపు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలం కావడంపై ప్రజల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.

ఒకప్పుడు సామాన్యుడి పళ్లెంలో ఉండే ప్రాథమిక ఆహార పదార్థాల ధరలు ఇప్పుడు రెక్కలొచ్చి ఎగిరిపోతున్నాయి. నాణ్యమైన బియ్యం బస్తా (26 కేజీలు) ఏకంగా రూ. 2,200 దాటేసింది. బియ్యం ధరలు ఈ స్థాయిలో పెరగడం రాష్ట్ర చరిత్రలోనే మునుపెన్నడూ లేదని మ‌ధ్య‌త‌ర‌గ‌తి కుటుంబాన్ని మోసే వ్య‌క్తి కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు.

నూనె డబుల్ సెంట‌రీకి చేరువ‌లో ఉంది. వంటనూనె ప్యాకెట్ (లీటర్) ధర రూ. 195 కు చేరి సగటు కుటుంబాల బడ్జెట్‌ను తలకిందులు చేస్తోంది. టమోటాలు, ఉల్లిగడ్డలు సహా ఏ కూరగాయల మార్కెట్‌కు వెళ్లినా కిలో రూ. 80 నుంచి రూ. 100 పైమాటే చెబుతున్నారు. ఏది కొనాలన్నా, ఏం తినాలన్నా సామాన్యుడు భయపడాల్సిన దుస్థితి దాపురించింది.

‘మీ మార్ట్’ల పేరుతో హడావిడి
నిత్యావసరాల ధరలను అదుపులోకి తెచ్చి సామాన్యుడిని ఆదుకోవాల్సిన పౌరసరఫరాల శాఖ కేవలం పబ్లిసిటీ హంగామాకే పరిమితమైందనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. ‘మీ మార్ట్’లు పెడతామని, సబ్సిడీ ధరలకే సరుకులు ఇస్తామని పౌరసరఫరాల శాఖ సోషల్ మీడియాలో, పేపర్లలో గొప్పలు చెప్పుకోవడం తప్ప క్షేత్రస్థాయిలో సామాన్యుడికి ఒక్క రూపాయి ప్రయోజనం కూడా కలగడం లేదు.

దళారులు, అక్రమ వ్యాపారుల అడ్డగోలు దోపిడీని అరికట్టాల్సిన ప్రభుత్వం చేష్టలుడిగి చూస్తోంది. మార్కెట్లో ధరలను నియంత్రించాల్సిన పర్యవేక్షణ వ్యవస్థలు పూర్తిగా నిర్వీర్యమైపోయాయి. అధికారంలోకి వస్తే ధరలను అదుపు చేస్తామని, సంక్షేమ పథకాలతో పేదలను ఆదుకుంటామని గొప్పలు చెప్పిన చంద్రబాబు నాయుడు, ఇప్పుడు సామాన్యుడి నిత్య జీవితాన్ని తీవ్ర ఆందోళనలోకి నెట్టేశారు. నిరుపేద కుటుంబాలు రోజువారీ గడవడానికే అప్పుల పాలు కావాల్సిన దయనీయ పరిస్థితి ఏర్పడింది.

సంపద సృష్టిస్తామని చెప్పిన పచ్చ నేతలు.. సగటు జీవి ఇంట్లోని పొయ్యి వెలగకుండా ధరల భారాన్ని మోపడమేంటని ప్రజా సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేసి, ప్రచారార్బాటాలకే ప్రాధాన్యమిస్తున్న ఈ ప్రభుత్వ నిర్ల‌క్ష్య వైఖరి వల్ల రాష్ట్రంలో మధ్యతరగతి జీవనం రోజురోజుకూ భారంగా మారుతోందని ప్ర‌జ‌లు ఆరోపిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment