జూ.ఎన్టీఆర్ తల్లిని దూషించినా.. టీడీపీ అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో అనంతపురంలో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఆగడాలు పేట్రేగిపోతున్నాయనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌కు సంబంధించి మరో వివాదం తెరపైకి వచ్చింది. మంత్రి టీజీ భరత్‌కు బంధువైన కర్నూలుకు చెందిన ఓ మహిళ.. తన భూమి కొనుగోలు వ్యవహారంలో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, ఆయన అనుచరులు తనను బెదిరిస్తున్నారని ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై అనంతపురం డీఐజీ, ఎస్పీతో పాటు డీజీపీకి కూడా ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది.
బాధిత మహిళకు అనంతపురంలోని భైరవనగర్‌లో 10 సెంట్ల స్థలం ఉంది. ఈ స్థలాన్ని రూ.70 లక్షలకు కొనుగోలు చేసేందుకు ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఒప్పందం చేసుకున్నారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే ఇప్పటివరకు రూ.10 లక్షలకు మాత్రమే చెక్కు ఇచ్చారని, మిగిలిన రూ.60 లక్షలు చెల్లించాలని కోరితే బెదిరింపులు ఎదురవుతున్నాయని ఆమె వాపోయారు. భూమి సమస్య పరిష్కారం కోసం మంత్రి టీజీ భరత్ సిఫార్సుతో ఎమ్మెల్యేను కలిసిన తనకే ఈ పరిస్థితి ఎదురైందని మహిళ ఆవేదన వ్యక్తం చేశారు.
ఎమ్మెల్యే తనకు పదేపదే వాట్సాప్ సందేశాలు పంపడంతో పాటు ఫోన్ కాల్స్ చేస్తున్నారని మహిళ ఫిర్యాదులో పేర్కొన్నారు. తనను వేధించవద్దని ఎమ్మెల్యేను ప్రాధేయపడినట్లు వెల్లడించారు. వీరిద్దరి మధ్య జరిగిన ఫోన్ సంభాషణకు సంబంధించిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
గత నెల 16వ తేదీన ఎమ్మెల్యే అనుచరులు తనను వెంబడించారని, వారి నుంచి తప్పించుకున్నానని కూడా ఆమె ఫిర్యాదులో వివరించారు. ఈ వ్యవహారంలో ఎమ్మెల్యేతో పాటు మరో పది మంది టీడీపీ నేతలపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. బాధిత మహిళ ఫిర్యాదుతో అనంతపురం రాజకీయ వర్గాల్లో ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.
ఇప్పటికే ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌పై వివిధ వివాదాలు, ఫిర్యాదులు వస్తున్నా పార్టీ అధిష్ఠానం స్పందించడం లేదంటూ రాజకీయ విమర్శలు వినిపిస్తున్నాయి. మంత్రి నారా లోకేష్‌కు ఎమ్మెల్యే ప్రసాద్ సన్నిహితుడు కావడంతోనే అతనిపై చర్యలకు అటు పార్టీ అధిష్టానం, ఇటు పోలీసులు వెనకాడుతున్నారనే ఆరోపణలున్నాయి.








