నటి, యాంకర్ అనసూయ భరద్వాజ్ (Anasuya Bharadwaj) పై సోషల్ మీడియాలో జరుగుతున్న వేధింపుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆమెపై అసభ్యకర పోస్టులు (Obscene Posts) చేస్తూ, వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్న వ్యక్తిని సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. కడప జిల్లాకు చెందిన జనార్దన్ (Janardhan) అనే వ్యక్తి సోషల్ మీడియాలో అనసూయను టార్గెట్ చేస్తూ వికృత చేష్టలకు (Objectionable Acts) పాల్పడ్డాడు. వ్యూస్, ఫాలోవర్లు పెంచుకోవాలనే ఉద్దేశంతో ఆమెకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను మార్ఫింగ్ (Morphing) చేయడం, అసభ్యకరంగా ఎడిట్ చేయడం వంటి పనులు చేస్తూ అభ్యంతరకరమైన వ్యాఖ్యలతో పోస్టులు పెడుతున్నట్లు పోలీసులు గుర్తించారు.
తనపై జరుగుతున్న ఈ డిజిటల్ వేధింపులను తీవ్రంగా పరిగణించిన అనసూయ గతంలోనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు సాంకేతిక ఆధారాలతో నిందితుడిని గుర్తించి కడపలో అదుపులోకి తీసుకున్నారు. విచారణలో తనే ఆ పోస్టులు పెట్టినట్లు జనార్దన్ అంగీకరించినట్లు సమాచారం. కేవలం సోషల్ మీడియా రీచ్ కోసం సెలబ్రిటీలను లక్ష్యంగా చేసుకున్నానని అతడు వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం అతనిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నారు. ఈ ఘటన టాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.








